
భార్యాభర్త, ముగ్గురు పిల్లల మృతి
వారం రోజులదాకా బయటపడ్లే
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం
ఢిల్లీలోని ఓ ఇంట్లో ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పక్కింటోళ్లు పోలీసులకు ఫోన్ చేశారు. వాళ్లొచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. ఓ రూంలో మూడు, మరో రూంలో రెండు మృతదేహాలను గుర్తించారు. భార్యాభర్తలతో పాటు ముగ్గురు పిల్లల మృతదేహాలని పోలీసులు భావిస్తున్నారు. అయితే, వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారా.. ఎవరైనా హత్య చేశారా అనేది తెలియరాలేదు. ఘటనా స్థలంలో ఎలాంటి నోట్ దొరకలేదని పోలీసులు చెప్పారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ భజన్‌పురాలో ఈ దారుణం వెలుగుచూసింది. కాలనీలోని ఓ ఇంట్లో శంభునాథ్(43) భార్య సునీత(38) దంపతులు కిరాయికి ఉంటున్నారు. ఐదున్నరేళ్లుగా వాళ్ల కుటుంబం ఇక్కడే ఉంటోందని పక్కింటోళ్లు చెప్పారు. శంభునాథ్ ఆటో రిక్షా నడుపుతుండేవాడని చెప్పారు. వారికి ముగ్గురు పిల్లలు.. శివమ్(18), కవిత(16), సచిన్(14) ఉన్నారు. బుధవారం బయటపడ్డ మృతదేహాలు వీళ్లవే నని పోలీసులు చెప్పారు. కుటుంబంలో మొత్తం అందరూ చనిపోవడం.. దుర్వాసన వచ్చేంత వరకూ వారు చనిపోయిన విషయం బయటపడకపోవడం గమనార్హం. ఇంటిలోపల మృతదేహాలు ఉండగా.. ఒక డోర్ లోపలి నుంచి, మరో డోర్ బయటి నుంచి బోల్ట్ పెట్టి ఉందని పోలీసులు చెప్పారు. చనిపోయి చాలా రోజులు కావడంతో కుళ్లిపోయిన మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కుటుంబం మొత్తం ఎలా, ఎందుకు చనిపోయింది.. ఆత్మహత్య చేసుకున్నారా లేక హత్యకు గురయ్యారా.. వారం రోజుల దాకా ఈ విషయం ఎందుకు బయటపడలేదనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు. అనుమానాస్పద మరణాలుగా కేసు ఫైల్ చేశామన్నారు.