
- వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు
- చత్తీస్‌గఢ్‌లోని చంపా జిల్లాలో ఘోరం
భద్రాచలం, వెలుగు: నిరుపయోగంగా ఉన్న బావిలోకి దిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితోసహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్-చంపా జిల్లాలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. కికిర్దా గ్రామానికి చెందిన రామచంద్ర జైస్వాల్(60).. బావిలో పడిన ఓ చెక్కముక్కను తీసేందుకు తాడు సాయంతో నీళ్లలోకి దిగాడు. ఆయన సోయితప్పి పడిపోవడం చూసి భార్య కేకలు వేసింది.
దీంతో సాయం చేసేందుకు వచ్చిన పొరుగింటి రమేశ్ పటేల్(50) బావిలోకి దిగాడు. ఊపిరాడట్లేదంటూ రమేశ్ పటేల్ కేకలు వేయడంతో ఆయన కొడుకులు జితేంద్ర పటేల్(25), రాజేంద్ర పటేల్(20) ఒకరి తర్వాత ఒకరు బావిలోకి దిగారు. వీళ్లలో ఎవరూ బయటికి రాకపోవడంతో కాపాడుదామని టికేశ్వర్ చంద్ర(25) అనే మరో యువకుడు బావిలోకి దిగాడు. ఇలా లోపలికి వెళ్లిన ఏ ఒక్కరూ తిరిగిరాలేదు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందం సాయంతో ఐదుగురి డెడ్‌బాడీలను వెలికితీశారు.
బావి నిరుపయోగంగా ఉండటంతోనే..
కొంతకాలంగా బావి నిరుపయోగంగా ఉండటంతో విష వాయువులు నిండిఉంటాయని, ఆ విషవాయువులు పీల్చడం వల్లే ఈ ఐదుగురు చనిపోయారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. డెడ్‌బాడీలను పోస్ట్‌మార్టానికి తరలించారు. రిపోర్టు రాగానే మరణాలకు కారణాలు తెలుస్తాయన్నారు. జైస్వాల్ తన ఇంటి ఆవరణలో 4 నెలల కింద బోర్ వేయించినప్పటి నుంచి బావిలో నీళ్ల వాడకం బంజేశారని స్థానికులు చెప్తున్నారు. బావిలో పడిన చెక్కను తీసేందుకు జైస్వాల్ నీళ్లలోకి దిగాడని వివరించారు. కాగా, మృతుల కుటుంబాలకు సీఎం విష్ణుదేవ సాయి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.