
- ఉమ్మడి ఆదిలాబాద్‌కు వెయ్యి కోట్లు ఇస్తామన్న హామీ ఏమైంది ?
భైంసా, వెలుగు : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి రూ. వెయ్యి కోట్లు ఇస్తామని ఇటీవల ప్రకటించిన మోదీ ఇప్పటివరకు నయా పైసా ఇవ్వలేదని మంత్రి సీతక్క విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ ఆత్రం సుగుణకు మద్దతుగా ఆదివారం నిర్మల్ జిల్లా బాసర, తానూర్ మండలాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అగర్‌బత్తీపై కూడా ఐదు శాతం జీఎస్టీ వేస్తోందన్నారు. రైల్వేను ఇప్పటికే కార్పొరేట్‌పరం చేయడంతో పాటు, అనేక విద్యాలయాలను కార్పొరేట్లకు అప్పగించారని ఆరోపించారు.
బీజేపీ అక్షింతలు పంచడం ఆపి ప్రజలకు మేలు చేయాలని సూచించారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేయడం మన లక్ష్యమన్నారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆత్రం సుగణను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ముందుగా శారదానగర్ నల్ల పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భారీ వర్షాలు పడిన టైంలో ఇండ్లు మునిగిపోతున్నాయని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకురాగా ఎకరం భూమి కొని పక్కా ఇండ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు నారాయణ్ పటేల్, విఠల్‌రెడ్డి, నాయకులు, మామ్మాయి రమేశ్ పాల్గొన్నారు.