ఐదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

ఐదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఎన్నికల నిర్వాహణపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ స్పష్టత ఇచ్చింది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. 7 దశల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేసింది. యూపీలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు  మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర్ ప్రదేశ్లో ఫిబ్రవరి 10న ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ జరగనుండగా.. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాల్లో ఫిబ్రవరి 14న, మణిపూర్ లో ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కించనున్నారు. షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో తక్షణమే ఎన్నికల కోడ్అమల్లోకి వస్తుందని ఈసీ స్పష్టం చేసింది. జనవరి 14న తొలిదశ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లో ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.

  • మొదటి విడత – ఫిబ్రవరి 10
  • రెండో విడత     – ఫిబ్రవరి 14
  • మూడో విడత    – ఫిబ్రవరి 20
  • నాల్గో విడత      – ఫిబ్రవరి 23
  • ఐదో విడత        – ఫిబ్రవరి 27
  • ఆరో విడత        – మార్చి 03
  • ఏడో విడత        – మార్చి 07
  • పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా    – ఫిబ్రవరి 14
  • మణిపూర్             – ఫిబ్రవరి 27, మార్చి 3

కరోనా దృష్ట్యా పోలింగ్ కేంద్రాల పెంపు
కేంద్రంతో పాటు అన్ని పార్టీల నాయకులతో చర్చించిన తర్వాతే ఎన్నికల నిర్వాహణపై నిర్ణయం తీసుకున్నట్లు సీఈసీ సుశీల్ చంద్ర ప్రకటించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. గతంలో ఒక్కో పోలింగ్ బూత్ లో గరిష్టంగా 1,500 మంది ఓటర్లు ఉండగా.. కరోనా దృష్ట్యా ఈసారి ఆ సంఖ్యను 1,250కు కుదించారు. ఫలితంగా పోలింగ్ కేంద్రాల సంఖ్య 16శాతం మేర పెరిగింది. ఐదు రాష్ట్రాల్లోని 690 నియోజకవర్గాల్లో 2.15లక్షల పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద సోషల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకోవడంతో పాటు మాస్కులు, సానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయనున్నట్లు సీఈసీ చెప్పారు. కోవిడ్ దృష్ట్యా పోలింగ్ సమయాన్ని గంట పాటు పెంచుకున్నట్లు ప్రకటించారు.

18.34 కోట్ల మంది ఓటర్లు
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఈసారి 18.34 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 8.55కోట్ల మంది మహిళలు ఉన్నారు. 24.9లక్షల మంది తొలిసారి ఓటు వేయనున్నారు. కరోనా సోకిన వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. ఈసారి అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చును ఎలక్షన్ కమిషన్ రూ.40లక్షలకు పెంచింది. ఎన్నికల్లో ప్రలోభాలపై సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. దివ్యాంగులు, 80ఏళ్లు దాటిన వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. పార్టీలో అభ్యర్థుల నేర చరిత్రను వైబ్ సైట్లో పెట్టడంతో పాటు వారి ఎంపికకు కారణాలను బహిర్గతం చేయాలని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. అర్హులైన ఎన్నికల సిబ్బందికి కోవిడ్ బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్లు సీఈసీ సుశీల్ చంద్ర ప్రకటించారు.

యాత్రలు, ర్యాలీలకు అనుమతిలేదు
ఈ నెల 15 వరకు రాజకీయ పార్టీలు రోడ్ షోలు, పాదయాత్రలు, సైకిల్, బైక్ ర్యాలీలకు పర్మిషన్ లేదని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి యాత్రలు, ర్యాలీలకు అనుమతించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ గడువు మార్చితో ముగియనుండగా.. యూపీ శాసనసభ కాలపరిమితి మే నెలతో పూర్తికానుంది. యూపీలో 403 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా.. ఉత్తరాఖండ్లో 70, పంజాబ్లో 117, గోవాలో 40, మణిపూర్లో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.