
చీరలతోనే 5 వేల గూడారాలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజుకోచోట ఘటనలు
ఇండ్ల జాగలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం నెల్లుట్ల శివారు సర్కారు భూమిలో పేదలు చీరలతోనే ఐదు వేల గుడారాలు వేసుకున్నారు. అక్కడే పాలు పొంగించి వంట చేసుకున్నరు. ఇండ్లు లేదా ఇండ్ల జాగలు ఇచ్చేదాక కదిలేది లేదని తేల్చి చెప్పారు. చిల్పూర్ మండలం రాజవరంలోనూ ప్రభుత్వ భూమిలో పేదలు గుడారాలు వేసుకున్నారు.
జనగామ, స్టేషన్ ఘన్పూర్, వెలుగు : కేసీఆర్ ఇస్తానన్న డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పటికీ రాలే. రూ.3 లక్షల స్కీమ్కింద పైసలిచ్చినా కట్టుకునేందుకు గుంట జాగ లేదు. దీంతో జనగామ జిల్లాలో పేదలు వేలాదిగా తరలొచ్చి సర్కార్ భూముల్లో చీరలతో గూడారాలు వేసుకున్నరు. అక్కడే పాలు పొంగించి, వంట చేసుకున్నరు. ఇండ్లు లేదా ఇండ్ల జాగలు ఇచ్చేదాక కదిలేది లేదని తేల్చి చెప్పారు. జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం నెల్లుట్ల శివారులో సర్వే నెంబర్464, 465, 466లలోని సుమారు ఏడెకరాల సర్కారు భూమిని సోమవారం పేదలు ఆక్రమించారు. లింగాల ఘన్పూర్ తో పాటు చుట్టుపక్కల మండలాలకు చెందిన సుమారు 5 వేల మంది బతుకమ్మ చీరలతో గూడారాలు వేసుకున్నారు. అలాగే, చిల్పూర్ మండలం రాజవరంలోనూ సర్వే నెం.78లోని 5 ఎకరాల ప్రభుత్వ భూమిలో పేద ప్రజలు గూడారాలు వేసుకున్నారు.
సర్కారు రూ.3 లక్షల ప్రకటనతో
గూడులేని పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తామని సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్ల కింద హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పేదలు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, నియోజకవర్గానికి పట్టుమని వెయ్యి కూడా శాంక్షన్ చేయలేదు. ఇచ్చినవాటిలో సగం కూడా పూర్తికాలేదు. అయితే, ఇప్పుడు రాకునున్నా ఎలక్షన్ వరకైనా వస్తాయి అని ఇన్నాళ్లు సర్కారు మీద నమ్మకంతో కిరాయి ఇండ్లల్లో ఉంటూ నెట్టుకొస్తున్నారు. కాగా, ఇటీవల జాగలు ఉన్నవాళ్లు ఇండ్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పేదలు భగ్గుమంటున్నారు. ఇన్ని రోజులు ఇండ్లు ఇస్తమని ఊరించి, చివరికి ఆ స్కీమే ఎత్తేసే కుట్ర చేస్తున్నరని మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఇండ్లు లేని పేదలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ భూములపైకి వస్తున్నారు. జనగామ జిల్లాలోని లింగాల ఘన్పూర్, చిల్పూర్ మండలాలతో పాటు వరంగల్ సిటీ, హనుమకొండ జిల్లాలోని కమలాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లోనూ ఇలాగే సర్కారు జాగల్లో గుడారాలు వేసుకొని ఆక్రమిస్తున్నారు.
ఇంటి జాగ ఇయ్యాలె..
నేను, నా భర్త కూలిపని చేసుకొని బతుకుతున్నం. మాకు నిలువ నీడ లేదు. కిరా యి ఇంట్లో ఉంటున్నం. డబుల్బెడ్రూం ఇంటి కోసం మస్తు సార్లు ఆఫీసర్లకు మొర పెట్టుకున్న. ఇప్పటి వరకు ఇయ్యలె. గిప్పుడైనా జాగా ఇయ్యాలని గుడిసె వేసి పోరాటం జేస్తున్న.
- మందుగుల మహేశ్వరి, కుందారం, లింగాల ఘన్పూర్ మండలం
పట్టించుకుంటలేరు
కేసీఆర్ సారు.. మా అసొంటోళ్లకు ఇండ్లియ్యకుంటే ఎట్లా.. ఉన్నోళ్లకే మంచి చేస్తున్నడు. మాలాంటి పేదోళ్ల గోడు పట్టించుకోవాలె. ఇండ్లన్న ఇయ్యాలె.. లేదంటే ఇండ్ల జాగన్న ఇయ్యాలె. ఏదో ఒకటి తేలేవరకు పోరాటం చేస్తనే ఉంటం.
- ఏల రమ, కిష్టగూడెం, లింగాల ఘన్పూర్ మండలం.
ఇంటి జాగ కోసం వెళ్లి తిరిగి రాని లోకానికి..
రఘునాథపల్లి(లింగాల ఘనపూర్), వెలుగు : ఇంటి జాగ కోసం ప్రభుత్వ భూమిలో గూడారం వేసుకున్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోయాడు. రఘునాథపల్లి మండలం మల్లంపల్లికి చెందిన తాళ్లపల్లి ఐలయ్య(55) కూలి చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇంటి జాగ కోసం సోమవారం లింగాల ఘనపూర్ మండలం పటేల్ గూడం ప్రభుత్వ జాగలో గూడారం వేసుకున్నాడు. సాయంత్రం ఆటోలో తిరిగి ఇంటికి వెళ్తుండగా.. నెల్లుట్ల శివారులో ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆయన స్పాట్లో చనిపోగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి.