
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే హత్య కుట్రకు సంబంధించిన సంచలన వీడియో బయటకు వచ్చింది. ఐదుగురు వ్యక్తులు మద్యం సేవిస్తూ హత్యకు సంబంధించిన ప్లాన్ గురించి చర్చించుకుంటున్న వీడియో బయటకు రావడం వైరల్ గా మారింది. ఈ వీడియో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేయాలని అయిదుగురు వ్యక్తులు మద్యం మత్తులో చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యేను హతమారిస్తే డబ్బే డబ్బు అంటూ ఆ వీడియోలో మాట్లాడుకుంటున్నారు. ఈ ప్లాను వెనుక రౌడీషీటర్ శ్రీకాంత్, ముఖ్య అనుచరుడు జగదీశ్ ఉన్నట్లుగా టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. రౌడీషీటర్లు జగదీశ్, మహేశ్, వినీత్, మరో ఇద్దరు ఫుల్లుగా మద్యం సేవించి ప్లాను గురించి చర్చిస్తుండటం వీడియో తీశారు.
►ALSO READ | రుషికొండ భవనాలపై డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు..
కుట్ర వెనుక వైసీపీ పెద్దల హస్తముందని టీడీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్ వివేకా హత్య తరహాలో చంపేయాలని కుట్రపన్నారని ఆరోపిస్తున్నారు. ఈ వీడియో గురించి ఐదు రోజులు కిందటే పోలీసులకు తెలిసినా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోటంరెడ్డిని హతమారిస్తే రాబోయే ఎన్నికల్లో గూడూరు, సూళ్లూరుపేటలో ఓ టిక్కెట్టు ఇస్తామని వైసీపీ పెద్దలు ఆ వ్యక్తులకు హామీ ఇచ్చినట్టు టీడీపీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది.