ది చాయ్​ వాలాతో విదేశాల్లోనూ పాపులర్​ అయ్యిండు

ది చాయ్​ వాలాతో విదేశాల్లోనూ పాపులర్​ అయ్యిండు

ఒకప్పుడు పొట్టకూటి కోసం ఇంటింటికీ తిరిగి న్యూస్​ పేపర్లు వేశాడతను.  కట్​ చేస్తే ఇరవై ఏండ్లలో.. కోట్ల రూపాయల వ్యాపారాన్ని స్థాపించాడు.  ది చాయ్​ వాలాతో విదేశాల్లోనూ పాపులర్​ అయ్యాడు. అది కూడా అనాథాశ్రమంలో పెరిగి,  ఇంటర్మీడియెట్​​ చదివి.  పేదరికం నేర్పిన పాఠాలే.. ఇక్కడి వరకు తీసుకొచ్చాయని చెప్తున్న అతని పేరు ఫైజల్​ యూసఫ్​. సొంతూరు కేరళలోని అలప్పుజ.

టెక్స్ట్​​బుక్స్​లో లేని పాఠాలెన్నో జీవితం నేర్పిస్తుంది అంటున్న ఫైజల్​ చిన్నప్పట్నించీ కష్టాలతోనే సావాసం చేశాడు. ఊహ తెలియక ముందే తండ్రి దూరమయ్యాడు అతనికి.  పోషణకి డబ్బు లేక తల్లి అతన్ని అనాథాశ్రమంలో చేర్పించింది. అక్కడ గడిపిన ప్రతి క్షణం  ఓ పాఠం నేర్పింది అతనికి. దాంతో టెక్స్ట్​​బుక్స్​పై  ఇంట్రెస్ట్​ పెట్టలేకపోయాడు. ఇంటర్మీడియెట్​  చదువు మధ్యలోనే ఆపేశాడు. ఆ తర్వాత మూడు పూటల కడుపు నింపుకోవడానికి పేపర్​ బాయ్​గా పనిచేశాడు. అలా రోజులు గడుస్తుండగా ఫైజల్​ని పేపర్​ బాయ్​గా పెట్టించిన  న్యూస్​ ఏజెన్సీ యజమాని చనిపోయాడు. దాంతో మళ్లీ ఉద్యోగం వేటలో పడ్డాడు. కొన్ని మార్కెటింగ్​ జాబ్స్​ చేశాడు. ఆ తర్వాత ముంబైలో ఎస్టేట్​ ఏజెంట్​గా పనిచేశాడు. అక్కడ్నించి  తెలిసిన వాళ్ల ద్వారా దుబాయ్​ వెళ్లాడు. అక్కడ కొన్నాళ్లు పనిచేశాక.. ఇంగ్లండ్​లోని  కాఫీ పౌడర్​ తయారు చేసే ఒక​ కంపెనీలో  చేరాడు. అక్కడ వచ్చిందే ఈ టీ స్టాల్ ఐడియా.

ఆ రుచి కోసం..

కాఫీ తయారీ కంపెనీలో పనిచేస్తున్నప్పటికీ, ఫైజల్​ మనసంతా మసాలా చాయ్​ చుట్టూనే తిరుగుతుండేది. కానీ, ఇంగ్లండ్​లో ఎంత వెతికినా మన ఇండియన్​ స్టైల్​ చాయ్​ దొరకలేదు అతనికి. దాంతో తనే టీలతో ఎక్స్​పరిమెంట్స్​ చేసేవాడు. టీలలో డిఫరెంట్​ ఫ్లేవర్స్​ ట్రై చేశాడు. వాటిని ఇంగ్లండ్​లోని కొన్ని స్ట్రీట్ మార్కెట్స్​లో అమ్మాడు. అవి రుచి చూసినవాళ్లంతా  టేస్టీగా ఉందని కాంప్లిమెంట్స్​ ఇచ్చారు.  దాంతో ఇండియాకి వచ్చి చాయ్ బిజినెస్​ పెట్టాలనుకున్నాడు.  ఇంగ్లండ్​లో అందుకు సంబంధించిన కోర్సు ఒకటి  చేశాడు. కానీ, తనతో పాటు అక్కడ పనిచేస్తున్న ఇండియన్స్​ అంతా.. ‘ఇప్పటికే మనదగ్గర గల్లీకో టీ స్టాల్ ఉంది. నిలదొక్కుకోవడం కష్టం’ అన్నారు. అయినా వెనకడుగేయలేదు ఫైజల్. కేరళకి తిరిగొచ్చి మొదట ఆన్​లైన్​లో చాయ్​ పౌడర్లు​ అమ్మాలనుకున్నాడు. కానీ, పెట్టుబడికి అంత డబ్బు లేకపోవడంతో.. టీ స్టాల్స్​ పెట్టాలనుకున్నాడు. అందుకోసం మనదగ్గరున్న చాలా టీ స్టాల్స్​ని గమనించాడు. తను ఇంగ్లండ్​లో చూసిన డిఫరెంట్​ టీ స్టాల్స్​ని ఇన్​స్పిరేషన్​గా తీసుకొని ‘ ది చాయ్​ వాలా’ ని తీసుకొచ్చాడు. 

కుకీస్​, కట్లెట్స్​ కూడా..

ది చాయ్​ వాలాలో పుదీనా, పాన్​, కుంకుమ పువ్వు, కఢక్​, తులసి.. ఇలా దాదాపుగా యాభై వెరైటీల టీ, కాఫీలు ఉంటాయి. ఇండియన్​ మసాలా చాయ్​  సేల్స్​లో  వాటకన్నింటికన్నా  ఎప్పుడూ టాప్​లో ఉంటుందని చెప్తున్నాడు ఫైజల్. ఈ చాయ్​కి అవసరమయ్యే​  12 రకాల  ముడిసరుకుల్ని రైతుల నుంచి సేకరించి  రకరకాల మసలాలు తయారుచేస్తున్నాడు. అలాగే అస్సాం, నీలగిరి బ్లాక్​ టీ కూడా చాలా ఫేమస్.  కుకీస్​తో పాటు సమోసా, కట్లెట్​ లాంటి శ్నాక్స్​, జ్యూస్​లు కూడా  ఉంటాయి. ప్రస్తుతం కేరళ, కర్నాటకలో యాభైకి పైగా  ఫ్రాంచైజీలు ఉన్నాయి ది చాయ్​ వాలాకి. త్వరలో ముంబై, హైదరాబాద్​కి దీన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడట ఫైజల్​.

వ్యాపారానికి నిజమైన పెట్టుబడి  సాధించగలమన్న నమ్మకమే. దాని తర్వాతే డబ్బు వస్తుంది. నన్ను నేను నమ్మాను. కాబట్టి.. ఇక్కడి వరకు రాగలిగా. పాన్ ఇండియా వెంచర్​గా  ది చాయ్​ వాలాని మార్చాలనుకుంటున్నా. రానున్న ఐదేండ్లలో దేశ వ్యాప్తంగా వెయ్యికి పైగా స్టాల్స్​ లక్ష్యంగా పనిచేస్తున్నాం. 

- ఫైజల్​