చైనాలో ఆకస్మిక వరదలు

 చైనాలో ఆకస్మిక వరదలు
  • గన్సు ప్రావిన్స్‌లో పది మంది మృతి..33 మంది గల్లంతు
  • 4 గ్రామాల్లో 4 వేల మందిపై ప్రభావం

బీజింగ్: చైనాలో భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. వరదల ధాటికి గన్సు ప్రావిన్స్‌లో పది మంది చనిపోయారు. మరో 33 మంది గల్లంతయ్యారు. గన్సు ప్రావిన్స్‌లోని యుజోంగ్ కౌంటీలో గురువారం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయని అధికారులు శుక్రవారం వెల్లడించారు. దాంతో లాన్‌జౌ సిటీ ఏరియాలోని పర్వత ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయని..కొండచరియలు విరిగి పడ్డాయన్నారు. పర్వత ప్రాంతాల్లోని నాలుగు గ్రామాలకు విద్యుత్ అంతరాయంతోపాటు ఫోన్ సేవలు కూడా నిలిచిపోయాయన్నారు. 

దాదాపు 4 వేల కంటే ఎక్కువ మంది ప్రభావితమయ్యారని చెప్పారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. అత్యవసర సామగ్రి సెట్లను పంపినట్లు వివరించారు. రోడ్లపై శిథిలాలను తొలగించడం, డ్రైనేజీలను తెరవడం, వీధుల్లో నిలిచిన నీటిని పంప్ చేస్తున్నారు. కాగా..గడిచిన 48 గంటల్లో వర్షం సంబంధిత కారణాల వల్ల చైనాలో మరణాల సంఖ్య 17కి చేరింది. గ్వాంగ్‌జౌలోని డాయువాన్ గ్రామంలో కొండచరియలు విరిగి ఇండ్లపై పడటంతో ఏడుగురు చనిపోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. కాగా, భారీ వర్షాలతో  చైనాలో విమాన సేవలు కూడా ప్రభావితం అయ్యాయి. గ్వాంగ్‌జౌ బైయున్ విమానాశ్రయం బుధవారం 360 విమానాలను రద్దు చేసింది.