35 మందిని వదిలేసి టేకాఫ్ అయిన ఫ్లైట్

35 మందిని వదిలేసి టేకాఫ్ అయిన ఫ్లైట్

బెంగళూరు ఎయిర్ పోర్టులో 50 మంది ప్యాసింజర్లను వదిలేసి వెళ్లిన గో ఫస్ట్ ఎయిర్ వేస్ ఘటన మరువక ముందే అమృత్ సర్ లో అలాంటి ఘటన చోటు చేసుకుంది. 35మంది ప్రయాణికులను ఎయిర్ పోర్టులోనే వదిలేసి ఫ్లైట్ టేకాఫ్ అయింది. విమానం వెళ్లిపోయిన విషయం తెలుసుకుని తొలుత షాక్ అయిన ప్రయాణికులు ఆ తర్వాత ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై డీజీసీఏ ఎంక్వైరీకి ఆదేశించింది. 

సింగపూర్‌కు చెందిన స్కూట్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం బుధవారం రాత్రి 7.55గంటలకు అమృత్ సర్ నుంచి సింగపూర్ కు  బయలుదేరాల్సి ఉంది. అయితే అది కాస్తా మధ్యాహ్నం 3గంటలకే టేకాఫ్ అయింది. దీంతో 35మంది ప్రయాణికులను ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారు. దీంతో ఎయిర్ లైన్స్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రయాణికులు ఆందోళనకు దిగారు. 

ఫ్లైట్ టేకాఫ్ టైమింగ్ మార్పు గురించి ప్రయాణికులకు ఈ మెయిల్ ద్వారా సమాచారమిచ్చినట్లు స్కూట్ ఎయిర్ లైన్స్ చెప్పింది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఎయిర్ పోర్టుకు చేరుకున్న వారితో ఫ్లైట్ టేకాఫ్ అయిందని స్పష్టం చేసింది. ‘‘ఈ విమానంలో సుమారు 280 మంది ప్రయాణికులు సింగపూర్‌కు వెళ్లాల్సి ఉందని అయితే 35 మంది సమయానికి రాకపోవడంతో 253 మందితోనే టేకాఫ్ అయిందని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ చెప్పారు. అయితే ఎయిర్ పోర్టులో ఉండిపోయిన వారంతా ఒకే ఏజెంట్ నుంచి టికెట్లు బుక్ చేసుకున్నారని, ఏజెన్సీ ఫ్లైట్ టైమింగ్ మార్పుపై ప్రయాణికులకు సమచారం ఇవ్వకపోవడంతో ఇలా జరిగినట్లు తెలుస్తోంది.