
హైదరాబాద్, వెలుగు: ఈ–-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ తెలంగాణలో తన బిజినెస్‌ను విస్తరించింది. సంగారెడ్డిలో కొత్త ఫుల్‌ఫుల్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించడం ద్వారా తన సప్లయ్ చెయిన్‌ను బలోపేతం చేసింది. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ దీనిని వర్చువల్‌గా ప్రారంభించారు. తెలంగాణ పరిశ్రమ, వాణిజ్య శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.ఈ సదుపాయం తెలంగాణలోని వేలాది స్థానిక సెల్లర్లకు, ఎంఎస్ఎంఈలకు, రవాణా, డెలివరీ పరంగా ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా వీళ్లు జాతీయ మార్కెట్‌కు యాక్సెస్ పొందవచ్చు. ఈ ఫుల్ఫిల్మెంట్ సెంటర్‌ను 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఫలితంగా 40వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టించగలుగుతారు. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటి వరకు రాష్ట్రంలోని 14 వేల కంటే ఎక్కువ మంది సెల్లర్లను తన ప్లాట్‌ఫారమ్‌లో చేర్చుకుంది.
వర్కర్లను బాగా చూసుకోండి : మంత్రి కేసీఆర్
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఉద్యోగ భద్రత సరిగా ఉండని అసంఘటిత రంగ కార్మికులను బాగా చూసుకొని దేశానికి ఆదర్శంగా నిలవాలని ఫ్లిప్‌కార్ట్‌కు సూచించారు. పనిచేసేవాళ్లు సురక్షితంగా ఉండేలా చూసుకుంటే గిగ్ వర్కర్లకు ఇబ్బందులు రాకుండా చూడటం మనందరి బాధ్యత అని అన్నారు. ‘‘ఈ-–కామర్స్ రంగం వేగంగా దూసుకుపోతోంది. ఇందులో పనిచేయాలనే ఆకాంక్షను యువతలో పెంపొందించాలి. ఈ విషయంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉండేలా ఒక నమూనాను తయారు చేద్దాం. ఈరోజు తెలంగాణ ఏం చేస్తే రేపు దేశం అదే చేస్తుంది. కార్మికుల జీవనోపాధిని కాపాడటానికి ప్రభుత్వం, ఈ–కామర్స్ కంపెనీలు, మార్కెటింగ్, సెల్లర్లు, పార్ట్నర్ల మధ్య ఒప్పందం ఉండాలి. మహిళా స్వయం సహాయక సంఘాల సేవలను కూడా ఫ్లిప్‌కార్ట్ వాడుకోవాలి”అని అన్నారు.