తేలని ఇంజనీరింగ్‌ ఫీజుల వ్యవహారం

తేలని ఇంజనీరింగ్‌ ఫీజుల వ్యవహారం

రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజుల వ్యవహారం ఎటూ తేలడం లేదు. ఫీజులు పెంచాలని కాలేజీ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. వరుస సమావేశాలైన ఫీ రెగ్యులేటరీ కమిటీ ఎటూ తేల్చకుండా సమావేశం ముగించింది. ఇప్పటికే ఇంజినీరింగ్ మొదటి దశ కౌన్సెలింగ్ పూర్తికావడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. 

రాష్ట్రంలో ఇంజనీరింగ్  కోర్సుల ఫీజుల వ్యవహారం ఎటూ తేలలేదు. ఫీజులు తగ్గించాలని ఫీ రెగ్యులేటరీ కమిటీ.. ఫీజులు పెంచాలని కాలేజీ యాజమాన్యాలు సమావేశాలు జరుపుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన సమావేశంలో ఫీజులపై నిర్ణయాన్ని వెల్లడిస్తారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూశారు. కానీ ఈ సమావేశం ఎటూ తేల్చకుండానే ముగిసింది. ఫీ రెగ్యులేటరీ కమిటీ చెప్పిన  ఫీజులను కాలేజీ యాజమాన్యాలు ఒప్పుకోకపోవడంతో సమావేశం అర్ధాంతరంగా  ముగిసింది.

ఇదివరకు ఫీ రెగ్యులేటరీ కమిటీ సూచించిన ఫీజులను మూడేళ్ల పాటు అమలు చేశామని, మరో మూడేళ్ల కోసం కొత్త ఫీజులను నిర్ధారించాలని కాలేజీలు కమిటీని కోరాయి. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైందని, ఇంజనీరింగ్  మొదటి దశ కౌన్సెలింగ్  పూర్తయిందని, కాబట్టి ఫీజుల వ్యవహారాన్ని త్వరగా తేల్చాలని చెప్పాయి. అయితే ఫీజుల నిర్ధారణ సమయంలో పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. కాలేజీలు డిమాండ్  చేసినంత మేర ఫీజులను పెంచితే విద్యార్థులు... వారి తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుందని చెప్పారు. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన ఫీజులను నిర్ధారిస్తామన్నారు. కానీ  కాలేజీల యాజమాన్యాలు, ఫీ రెగ్యులేటరీ కమిటీ మధ్య  భేదాభిప్రాయాలు రావడంతో ఫీజులపై ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అధికారులు.

రీసెంట్ గా జరిగిన సమావేశంలో కాలేజీల గ్రేడులను పరిగణనలోకి తీసుకుని ఫీజుల వివరాలను అధికారులు వెల్లడించారు. కానీ ఈ ఫీజులకు కాలేజీలు అంగీకరించలేదు. తక్కువ ఫీజులను తాము ఒప్పుకొనేది లేదని దాదాపు 20 కాలేజీల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. దీంతో ఫీజుల వ్యవహారం ఎటూ తేలకుండాపోయింది. చివరకు అధికారులు సమావేశాన్ని వాయిదా వేశారు. తాము సూచించిన ఫీజులను ఒప్పుకోని కాలేజీల యాజమాన్యాలను మరోసారి పిలిచి, సమావేశం నిర్వహిస్తామని అధికారులు తెలియజేశారు. ఆ సమావేశంలోనే ఫీజులను ఖరారు చేసే అవకాశాలున్నాయి. 

ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో  విద్యార్థులు నష్టపోతున్నారని టెక్నికల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు అంటున్నారు. అసలు సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఫీజుల పై నిర్ణయం రాకముందే కౌన్సెలింగ్ నిర్వహించడం సరికాదని చెబుతున్నారు. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తి అయిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని ఫీజులపై సరైన నిర్ణయం వచ్చేలా చూడాలని టెక్నికల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు కోరుతున్నారు.

ఇంజనీరింగ్ ఫీజులపై నిర్ణయం కొలిక్కి రాకపోవడంతో  కౌన్సెలింగ్ ను వాయిదా వేస్తున్నట్లు ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. ఈ కౌన్సెలింగ్  అక్టోబరు 11 నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం...ఫీ రెగ్యులేటరీ కమిటీ సరైన నిర్ణయం తీసుకోకుంటే విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని విద్యావేత్తలు అంటున్నారు.