కేంద్రం రూ.10 వేల కోట్లు ఇవ్వాలి

కేంద్రం రూ.10 వేల కోట్లు ఇవ్వాలి
  • వరద సాయంపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని 
  • ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్ల ​ఎదుట సీపీఐ ధర్నా

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : వరద సాయంగా  కేంద్రం తెలంగాణకు రూ. 10వేల కోట్లు ఇవ్వాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్​ చేస్తూ ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్ల ​ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు. రెండుచోట్ల ఎమ్మెల్యే కూనంనేని పాల్గొని మాట్లాడారు. భారీ వర్షాలు, వరదలతో ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్​తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయన్నారు. ప్రతి విషయంలో స్పందించే కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి తన బాధ్యతను విస్మరించారని ఆరోపించారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఆయన ఫెయిల్​ అయ్యారన్నారు.

కేంద్ర ప్రభుత్వం వచ్చి పరిశీలించి వెళ్తుందే తప్ప తక్షణ సాయం ప్రకటించకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పాల్వంచలోని కిన్నెరసాని పరివాహక ప్రాంతాల్లోని వారికి వరదల నుంచి శాశ్వత పరిష్కారం చూపేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం కలెక్టరేట్లలో వినతిపత్రం అందజేశారు.

ఖమ్మంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, యర్రాబాబు, షేక్ జానిమియా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, నాయకులు పాల్గొనగా, ​కొత్తగూడెంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్​కె, సాబీర్​ పాషా, నాయకులు ముత్యాల విశ్వనాథం, కె. వెంకటేశ్వరరావు, పుల్లారెడ్డి, చంద్రగిరి శ్రీనివాస్​, నరాటి ప్రసాద్​, కె.సారయ్య, ఏపూరి బ్రహ్మయ్య, లక్ష్మీకుమారి, దేవరకొండ శంకర్​ పాల్గొన్నారు.