
- తెలంగాణ అభిప్రాయం తీసుకోవాలంటూ బోర్డుకు లేఖ
- ఏపీ అడగడమే ఆలస్యం.. స్పందించిన బోర్డు సెక్రటరీ
- ఇప్పటికే 159 టీఎంసీలు తరలించుకుపోయిన ఏపీ
- తెలంగాణ వాడుకున్నది 28 టీఎంసీలే
వరద రోజుల్లో వాడుకున్న నీటిని కేటాయింపుల్లో లెక్కించవద్దంటూ ఆంధ్రప్రదేశ్ కొత్త వాదనను తెరమీదికి తెచ్చింది. ఈ మేరకు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు లేఖ రాసింది. ఏపీ లేఖ రాయడమే తరువాయి బోర్డు సెక్రటరీ ‘దీనిపై మీ అభిప్రాయం చెప్పండి’ అంటూ తెలంగాణ ఈఎన్సీకి లేఖ రాశారు. ఏపీ తీరుపై, బోర్డు నిర్వాహకుల వ్యవహారశైలిపై తెలంగాణ ఇంజనీర్లు మండిపడుతున్నారు. ఇప్పటికే 159 టీఎంసీల నీటిని తరలించుకుపోయిన ఏపీ.. మళ్లీ అంతేస్థాయి నీటిని అక్రమ ప్రాజెక్టులకు తరలించేందుకు ఈ స్కెచ్ వేసిందని వారు ఆరోపిస్తున్నారు. వరద నీటిని లెక్కించ వద్దనడం కృష్ణా బోర్డు, కృష్ణా ట్రిబ్యునల్ చరిత్రలోనే ఎన్నడూ లేదని తెలంగాణ ఇంజనీర్లు అంటున్నారు.
లేఖలో ఏముంది?
కృష్ణా బోర్డు మెంబర్ సెక్రటరీకి ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ ఎం. వెంకటేశ్వర్‌రావు ఈ నెల 5న లేఖ రాశారు. కర్నాటక, మహారాష్ట్రల్లో కురిసిన భారీ వర్షాలతో ఏపీలోని శ్రీశైలం డ్యాం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు వరద పోటెత్తిందని అందులో పేర్కొన్నారు. ఈ ఫ్లడ్ సీజన్‌లో ఆగస్టు 13 నుంచి 25 వరకు కృష్ణా నదిలో భారీ వరద వచ్చిందని, ఈ రోజుల్లో 42,772 క్యూసెక్కుల నుంచి 7,49,981 క్యూసెక్కుల వరకు వరద నమోదైందని వివరించారు. నదిలో ఇంత ఎత్తున వరద వచ్చి నీళ్లన్నీ వృథాగా సముద్రం పాలవుతున్నా వివిధ ప్రాజెక్టుల నుంచి కాలువల పూర్తి సామర్థ్యం మేరకు నీటిని విడుదల చేయడం లేదంటూ అనేక పత్రికల్లో వార్తలు రాశారని తెలిపారు. ఆయా ప్రాజెక్టు అథారిటీలు ఆ సమయంలో విడుదలచేసిన నీటిని ఏపీ, తెలంగాణ కేటాయింపుల జాబితాలో చూపించాయని, ఆయా రాష్ట్రాల అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా కేటాయింపుల మేరకు నీటిని విడుదల చేశాయని పేర్కొన్నారు. సముద్రంలోకి నీరు వృథాగా వెళ్తుంది కాబట్టే కాలువల సామర్థ్యం మేరకు నీటిని తరలించామని తెలిపారు. ప్రాజెక్టులు పూర్తిగా నిండి గేట్లు ఎత్తిన సమయంలో తరలించిన నీటిని ఆయా రాష్ట్రాల కేటాయింపుల లెక్కల్లో చూపించకుండా మినహాయించాలని కోరారు. తమ ప్రతిపాదనపై తెలంగాణ అభిప్రాయం తీసుకోవాలని ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ సూచించారు. ఏపీ లేఖపై స్పందించిన కృష్ణా బోర్డు మెంబర్ సెక్రటరీ పరమేశం సోమవారం తెలంగాణ ఈఎన్సీకి లేఖ రాశారు. ప్రాజెక్టుల గేట్లు ఎత్తిన రోజుల్లో రెండు రాష్ట్రాలు ఉపయోగించుకున్న నీటిని కేటాయింపుల నుంచి మినహాయించాలనే ఏపీ ప్రతిపాదనపై స్పందన చెప్పాలంటూ తెలంగాణ ఈఎన్సీని కోరారు. ఏపీ లేఖపై వీలైనంత త్వరగా అభిప్రాయం చెప్పాలని సూచించారు. ఈ లేఖపై తెలంగాణ ఈఎన్సీ స్పందించాల్సి ఉంది.
కేటాయించిన
దానికన్నా ఎక్కువ తోడేసి..
మొన్న ఏపీ ఇండెంట్ ఇవ్వడమే మహాభాగ్యం అన్నట్టుగా బోర్డు ఒక్క టీఎంసీ కూడా కోత పెట్టకుండా ఆ రాష్ట్రానికి నీళ్లు కేటాయించేసింది. తెలంగాణకు మాత్రం కోతలు పెట్టింది. కృష్ణా బోర్డు ఏపీకి సెప్టెంబర్ 30 వరకు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి 152 టీఎంసీల నీటిని కేటాయించగా.. మంగళవారం వరకు 159 టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోయింది. తెలంగాణకు 59 టీఎంసీలను కేటాయించగా 28 టీఎంసీలే వాడుకుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచే ఏపీ 70 టీఎంసీల నీటిని తరలించుకుపోయింది. ఈ నీళ్లను మొత్తంగా బేసిన్ అవతలి ప్రాజెక్టులకే తరలించారు. నీటి కేటాయింపుల్లో బోర్డు ఏకపక్షంగా వ్యవహరించిందని, నీటి తరలింపులో ఏపీ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తోందని తెలంగాణ ఇంజనీర్లు మండిపడుతున్నారు. కేటాయింపులకు మించి ఇప్పటికే నీటిని తీసుకున్న ఏపీ జలవనరుల శాఖ శ్రీశైలంలోని నీటిని పెన్నా బేసిన్‌లోని ప్రాజెక్టులకు తరలించేందుకే తాజా ప్రతిపాదన చేసినట్టుగా వారు అనుమానిస్తున్నారు. ఏపీ ప్రతిపాదనపై బోర్డు తెలంగాణకు లేఖ రాయడం అంటే ఈ ప్రపోజల్‌కు ఆమోదం తెలిపినట్టేనని, దీన్ని అంగీకరించేది లేదని చెబుతున్నారు. మూడు నెలల్లోనే 159 టీఎంసీలను తీసుకున్న ఏపీ ఇంకా తొమ్మిది నెలలు ఇంకెన్ని నీళ్లు తీసుకుంటుందని ప్రశ్నిస్తున్నారు.