
- ఏండ్ల కాలంగా ప్రజలకు తీరని కష్టాలు
- వర్షాలు పుల్లుగా పడితే నరకమే..
- వరదలతో జలదిగ్బంధంలో చిక్కుకొని అరిగోస
ఆసిఫాబాద్, వెలుగు: ఎప్పుడు ఏ వాగు ఉప్పొంగుతుందో, ఏ వరద ముంచెత్తుతుందో తెలియని పరిస్థితి. వానాకాలం వచ్చిందంటేనే ఆదివాసీలు వణికిపోతారు. దారులన్నీ మూసుకుపోయి ఊర్లన్నీ జలదిగ్బంధంలో చిక్కుకుంటాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ఆరిగోస పడుతుంటారు. రోగులు, గర్భిణులు, బాలింతలు సర్కార్ దవాఖానాకు వెళ్లలేని దుస్థితి. ప్రాణాలమీదికొచ్చినా దిక్కులేని పరిస్థితి. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా కొన్నేళ్లుగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్డు, రవాణా సౌలత్ లేక అడవి బిడ్డలు అరిగోస పడుతూనే ఉన్నారు. వాగులపై పదేండ్లకు పైగా వంతెన నిర్మాణాలు కొనసాగుతున్నాయే తప్పా పూర్తి కావడంలేదు. ఈ ఏడాది సైతం పనులు పూర్తికాకపోవడంతో ఈ వర్షాకాలంలోనూ వారికి గోసలు తప్పేలా లేవు.
18 ఏళ్లుగా గోస పడుతున్న గుండి ప్రజలు
ఆసిఫాబాద్ మండలంలోని గుండి పెద్దవాగుపై నిర్మిస్తున్న వంతెన 18 ఏండ్లు గడుస్తున్నా పిల్లర్ల దశ దాటడం లేదు. 2006లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.2.80 కోట్ల అంచనాతో అప్పటి మంత్రి జీవన్ రెడ్డి బ్రిడ్జి పనులు ప్రారంభించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ హయాంలో బ్రిడ్జ్ బడ్జెట్ పెంచి కొంతమేర పనులు చేశారు. సగం వరకు పిల్లర్లు వేసి వదిలేశారు. అప్పటి నుంచి పనులు సాగకపోవడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ప్రతి ఏటా ఇబ్బందులు పడుతున్నారు.
అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిని కంప్లీట్ చేయాలని గ్రామస్తులు కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసి ధర్నా చేశారు. కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయమని గ్రామంలో ప్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. అధికారులు, నాయకులు సముదాయించి బ్రిడ్జ్ పనులు కంప్లీట్ చేస్తామని హామీ ఇవ్వడంతో ఎన్నికల్లో ఓట్లు వేశారు. కానీ నేటికీ మళ్లీ పనులు ప్రారంభించలేదు. ప్రతి వర్షాకాలంలో వరదలతో ఆయా గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి.
పదేండ్లుగా అసంపూర్తిగానే..
కెరమెరి మండలంలోని అనార్ పల్లి పెద్ద వాగుపై నిర్మిస్తున్న వంతెన పనులు పదేండ్లుగా అసంపూర్తిగానే ఉన్నాయి. పనులు పూర్తికాకపోవడంతో వర్షాకాలంలో గిరిజన గ్రామాల ప్రజలు వాగులు దాటలేక, మరో దారిలేక బిక్కుబిక్కుమంటూనే గడుపుతున్నారు. లక్మాపూర్ పెద్ద వాగుపై రూ.3 కోట్లతో నిర్మిస్తున్న వంతెన సైతం ఇంకా పూర్తి కాకపోవడంతో ఆయా గ్రామాల గిరిజనులు ఏటా ఇబ్బందులు పడుతున్నారు.
దిందా వాగు గండం
చింతలమానేపల్లి మండలం దిందా వాగు గండం నుంచి సమీప గ్రామాల ప్రజలు గట్టక్కడంలేదు. దశాబ్దాల తరబడి వానాకాలంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. గ్రామానికి చెందిన దోకే రామకృష్ణ అనే ఎంబీఏ స్టూడెంట్ 2015 ఆగస్ట్ 14న వాగులో కొట్టుకుపోయి చనిపోయాడు. వాగు మీద ఉన్న లోలెవల్ కాజ్ వేపై హైలెవల్ బ్రిడ్జి కట్టి తమ అవస్థలు తీర్చాలని ఆ గ్రామస్తులు చేస్తున్న పోరాటాలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది వాగు ఒడ్డున నిరాహార దీక్షలు చేశారు. కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టి తమ గోడు వెళ్లబోసుకున్నారు.