ఇవాళ కుమారస్వామి సర్కారుకు విశ్వాస పరీక్ష

ఇవాళ కుమారస్వామి సర్కారుకు విశ్వాస పరీక్ష

ఆగని కర్నాటకం..

బలపరీక్షపై సీఎంకు గవర్నర్ డెడ్ లైన్

బెంగళూరు: కాసేపట్లో ముగుస్తుందనుకున్న కథ కాస్తా థ్రిల్లర్​ను తలపిస్తూ మలుపులు తిరిగింది. కుమారస్వామి సర్కారు బలపరీక్ష సందర్భంగా కర్నాటక అసెంబ్లీలో గురువారం హైడ్రామా చోటుచేసుకుంది. సీఎం తనకు తానుగా విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కానీ కాంగ్రెస్​, జేడీఎస్​ ఎమ్మెల్యేలు మాత్రం సుప్రీంకోర్టు ఫైనల్​ జడ్జిమెంట్ వచ్చాకే బలపరీక్ష నిర్వహించాలని స్పీకర్​ను కోరారు. చర్చ దారితప్పుతోందని గ్రహించిన బీజేపీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాజ్​భవన్​​ ద్వారా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది. చర్చ ప్రారంభించిన తొలిరోజే ఓటింగ్​ చేపట్టాలంటూ స్పీకర్​ కేఆర్​ రమేశ్​ కుమార్​కు గవర్నర్​ వాజుభాయి వాలా లేఖ రాశారు. దాన్ని పట్టించుకోకుండా ఓటింగ్​కు ముందే డిప్యూటీ స్పీకర్ కృష్ణారెడ్డి​ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. ఊహించని పరిణామానికి షాక్​తిన్న బీజేపీ ఎమ్మెల్యేలు.. కాసేపు అసెంబ్లీలోనే ధర్నా చేసి, మరోసారి రాజ్​భవన్​ తలుపులు తట్టారు. దీంతో గవర్నర్​ నేరుగా యాక్షన్​లోకి దిగారు. ఓటింగ్​ జరుగుతుందా లేదా? అనే అనుమానాలకు తెరదించుతూ రాత్రికి రాత్రే ఉత్తర్వులు జారీచేశారు. శుక్రవారం మధ్యాహ్నం 1:30లోగా బలం నిరూపించుకోవాలంటూ సీఎం కుమారస్వామికి డెడ్​లైన్​ విధించారు. గురువారం నాటి సభకు మొత్తం 20 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. వాళ్లలో 17 మంది అధికార పక్షానికి చెందినవాళ్లే కావడం గమనార్హం. బీఎస్పీ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో కనిపించలేదు. కాగా, రాజీనామా చేసిన కాంగ్రెస్​ రెబల్​ రామలింగారెడ్డి మాత్రం సభకు హాజరయ్యారు.

దద్దరిల్లిన సభ

గురువారం ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే సీఎం కుమారస్వామి ఒకే వాక్యంలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రజలకు నిజానిజాలు చెప్పేందుకే ట్రస్ట్​ ఓటుకు సిద్ధపడ్డానన్న ఆయన.. ఈ పరిస్థితి కారణం బీజేపీ కుట్రలేనని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఏకైక ఉద్దేశంతో కొందరు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే, వాళ్లను సమర్థిస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పడం బాధాకరమని వ్యాఖ్యానించారు. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న సభకాస్తా కాంగ్రెస్​ పక్ష నేత సిద్ధరామయ్య ప్రసంగంతో ఒక్కసారిగా వేడెక్కిపోయింది. ‘‘సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల వల్ల సీఎల్పీ లీడర్ అయి ఉండి కూడా మా ఎమ్మెల్యేల్ని ఆదేశించలేకపోతున్నా. ముందుగా విప్​ అధికారాలపై క్లారిటీ రావాలి. దాన్ని సుప్రీం కోర్టే తేల్చాలి. ఫైనల్​ జడ్జిమెంట్​ తర్వాతే బలపరీక్ష నిర్వహించాలి. అప్పటిదాకా ఓటింగ్​ను వాయిదా వెయ్యండి”అని సిద్ధరామయ్య.. స్పీకర్​ రమేశ్​కుమార్​ను కోరారు. దీనిపై బీజేపీ అబ్జెక్షన్​ చెప్పింది. తీర్మానాన్ని స్వయంగా ప్రవేశపెట్టడం ద్వారా తనకు బలం లేదని సీఎం కుమారస్వామే ఒప్పుకున్నారని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓటింగ్​ చేపట్టాలని బీజేపీ లీడర్​ యడ్యూరప్ప స్పీకర్​ను డిమాండ్​ చేశారు. రూల్స్​ప్రకారమే నడుచుకుంటానని బదులిచ్చిన స్పీకర్​ రమేశ్​ కుమార్​.. మధ్యాహ్నం తర్వాత కూడా చర్చను కొనసాగించారు. కాంగ్రెస్​, జేడీఎస్ సభ్యులు ఒక్కొక్కరుగా మాట్లాడుతూ సుప్రీంతీర్పులోని లోపాల్ని ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. స్పీకర్​ ఎంతకీ ఓటింగ్​కు ఆదేశించకపోవడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. రెండు పక్షాలు వాదులాటకు దిగడంతో సభ చాలా సార్లు వాయిదా పడింది.

ఎమ్మెల్యే ‘కిడ్నాప్​’ ఫొటోలు..

అంతలోనే గవర్నర్​ లేఖ

రాజీనామాలు చేసిన 16 మంది కాకుండా అధికార పక్షానికి చెందిన మరో ఎమ్మెల్యే శ్రీమంత్​ పాటిల్​ గురువారం నాటి సభకు గైర్హాజరయ్యారు. రాత్రికి రాత్రే ఎమ్మెల్యే పాటిల్​ను బీజేపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ మంత్రి డీకే శివకుమార్​ ఆరోపించారు. ముంబైలోని ఆస్పత్రిలో ఎమ్మెల్యే ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న ఫొటోల్ని అసెంబ్లీలో చూపుతూ పాటిల్​ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన స్పీకర్​ రమేశ్​ కుమార్​.. ఇలాంటి గందరగోళంలో పనిచేయాల్సి రావడం బాధాకరమన్నారు. కిడ్నాప్​ వ్యవహారంపై రెండు పక్షాల మధ్య మళ్లీ గొడవ జరుగుతుండగానే. మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో గవర్నర్​ వాజుభాయి వాలా నుంచి అసెంబ్లీ స్పీకర్​కు ఓ లేఖ అందింది. ‘విశ్వాస ప్రక్రియను గురువారం సాయంత్రంలోగా ముగించాలి’అని రాసున్న లేఖను ఎమ్మెల్యేలకు చదివి వినిపించిన స్పీకర్.. చర్చను యథావిథిగా కొనసాగించారు. సాయంత్రం ఆరు గంటలకు స్పీకర్ రమేశ్ కుమార్ తన ఆఫీసుకు వెళ్లిపోగా, కొద్దిసేపటి తర్వాత డిప్యూటీ స్పీకర్​ కృష్ణారెడ్డి అసెంబ్లీని శుక్రవారానికి వాయిదావేశారు.

అసెంబ్లీలో ధర్నా..

ఓటింగ్​ చేపట్టకుండా అసెంబ్లీని వాయిదా వేయించిన అధికార పక్షంపై బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఓటింగ్ జరిగేదాకా సభ నుంచి బయటికెళ్లబో మంటూ రాత్రంతా అసెంబ్లీలోనే ఉంటామంటూ ధర్నాకు దిగారు. ‘‘సీఎం కుమారస్వామి ఇప్పటికే ప్రజల విశ్వాసం కోల్పోయారు. బలం 98కి పడిపోయినా ఇంకా పదవిలోనే కొనసాగుతున్నారు. తీర్మానంపై ఓటింగ్​ పెట్టకుండా సభను వాయిదావేశారు. గురువారం అసెంబ్లీలో జరిగిన పరిణామాల్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తాం.105 మంది ఎమ్మెల్యేలున్న మాకే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే హక్కుంది’’అని బీజేపీ పక్ష నేత యడ్యూరప్ప వ్యాఖ్యానించారు.