డాక్టర్లు కాదు టెర్రరిస్టులు : ఆస్పత్రి లాకర్లో AK 47 గన్

డాక్టర్లు కాదు టెర్రరిస్టులు : ఆస్పత్రి లాకర్లో AK 47 గన్

జమ్మాకాశ్మీర్ ఉలిక్కి పడింది. అనంత్ నాగ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్న డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్ అరెస్ట్ సంచలనంగా మారింది. డాక్టర్ గా పని చేస్తూనే.. టెర్రరిస్టుగా మారిన వైనం పోలీస్ విచారణలో బయటపడింది. భారతదేశంలో పెద్ద ఎత్తున విధ్వంసానికి ప్లాన్ చేస్తున్న విధానం బట్టబయలు అయ్యింది. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. 

జమ్మూకాశ్మీర్ రాష్ట్రం అనంతనాగ్ మెడికల్ కాలేజీలో లెక్చర్ గా పని చేస్తున్నాడు డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్. ఆర్మీకి వచ్చిన సమాచారం ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే.. డాక్టర్ ముసుగులో టెర్రరిస్ట్ అని తేలింది. ఆస్పత్రి లాకర్ లో అతను దాచిన ఏకే 47 తుపాకీ స్వాధీనం చేసుకున్నారు ఆర్మీ సిబ్బంది. మరింత లోతుగా విచారణ చేయగా.. హర్యానాలో దాచిన మందుగుండు సామాగ్రి బయటకు వచ్చింది. 

భారతదేశంలో పేలుళ్లకు ప్లాన్ చేయటంలో భాగంగా.. పెద్ద ఎత్తున బాంబులు సేకరించినట్లు కూడా ఈ టెర్రరిస్ట్ డాక్టర్ వెల్లడించాడు. అతను ఇచ్చిన సమాచారంతో.. హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ లో 300 కేజీల RDX, ఇతర బాంబులు స్వాధీనం చేసుకున్నారు ఆర్మీ అధికారులు. ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, ఆయుధాలను సేకరించటంలో.. వాటిని దాచటంలో పుల్వామా జిల్లాకు చెందిన మరో డాక్టర్ ముజామిల్ షకీల్ పాత్ర ఉన్నట్లు విచారణ తర్వాత క్లారిటీ ఇచ్చారు అధికారులు. ఇప్పుడు అతన్ని కూడా జమ్మూకాశ్మీర్ అధికారుల అదుపులో ఉన్నాడు. 

వీళ్లిద్దరికీ జైష్ ఏ మోహమ్మద్ ఉగ్రవాద సంస్థలో సంబంధాలు ఉన్నాయని.. వీళ్లతోపాటు మరి కొంత మంది డాక్టర్లు, ఇతర ఉద్యోగులు సైతం ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇస్తున్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది.