
కూకట్పల్లి, వెలుగు : బార్వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతుండగా.. అక్కడే ఉన్న మరో వ్యక్తిని పట్టుకుని పోలీసులు చితకబాదారు. కేపీహెచ్బీ పోలీసుస్టేషన్ పరిధిలో ఈనెల 24న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం ప్రకారం.. పూల వ్యాపారం చేసే ఇంతియాజ్ హైదర్నగర్లో ఉంటాడు. 24న రాత్రి హైదర్నగర్లో ముంబయి జాతీయ రహదారి పక్కన నిల్చున్నాడు. ఇదే టైంలో సిరి బార్ అండ్ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన ఇరు వర్గాలు మద్యం మత్తులో ఘర్షణ పడ్డాయి. కేపీహెచ్బీ పోలీసులు అక్కడకు చేరుకుని గొడవ పడుతున్న వారిని వదిలేసి చుట్టుపక్కల వారిపై లాఠీచార్జి చేయగా ఇంతియాజ్ గాయపడ్డాడు. గొడవతో తనకు సంబంధం లేదని మొత్తుకున్నా పట్టించుకోలేదు. తీవ్రంగా గాయపడిన అతడు ప్రైవేటు దవాఖానలో చికిత్స తీసుకున్నాడు. తనపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేయడానికి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్కు వెళితే ఎవరూ స్పందించలేదని, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.