పూలలో కన్నీరు: కిలో బంతిపూలు 10 రూపాయలే.. అయినా ఎవరూ కొనటం లేదు

పూలలో కన్నీరు: కిలో బంతిపూలు 10 రూపాయలే.. అయినా ఎవరూ కొనటం లేదు

మూర పూలకు జానెడు పొట్టకు లంకె. నాలుగు రెక్కలకు నాలుగు వేళ్లకు ముడి. బుట్టనిండా సువాసనే. ఇంట్లో గంజి వాసన కూడా రాదు. పూలమ్మే వాళ్ల జీవితాలు రాళ్లు మోసే వారి కంటే ఘోరంగా ఉన్నాయి...

 పండుగ అంటే ఇళ్లు, గుళ్లు కోలాహలంగా ఉన్నాయి. పూలదండలు వేళ్లాడుతున్నాయి. చుట్టిన దండలు బుట్టల్లో ఉన్నాయి. మరో పక్క విడిపూల గంపలు. గుళ్లో పూజారి మంత్రాలకంటే పూల బుట్టల దగ్గర బేరాలే గట్టిగా వినిపిస్తున్నాయి.   దసరా, దీపావళి పండుగలకు ఆశతో పండించిన పూల రైతులకు నిరాశ మిగిలింది.  ఎలాగూ దసరా పండుగకు పూల రైతులు నష్టాలనే చవి చూశారు.  దీపావళికైనా  ఎంతో కొంత బయటపడదామనుకున్న ఆశతో పండించిన పూల రైతులు గిట్టుబాటు ధర లేక వెలవెల బోతున్నారు.  పెట్టుబడి మాట అలా ఉన్నా.. కనీసం కూలి కూడా రాకపోవడంతో చామంతి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

చిత్తూరు జిల్లాలోని వి.కోట, కుప్పం, పలమనేరు మదనపల్లి మార్కెట్లకు  చుట్టుపక్కన ఉన్న ప్రాంతాల నుంచి చామంతి పూలు దిగుమతి అవుతాయి.  అక్కడి రిటైల్ పూల వ్యాపారులు తీసుకెళ్తూ ఉంటారు.    దీపావళి పండుగకు  పూలకు మంచి ధర పలుకుతుందని రైతులు ఆశించారు. మార్కెట్‌కు  25 వేల కిలోల చామంతి పూలు దిగుమతి కాగా..  కిలో రూ.10 రూపాయల నుంచి 15 రూపాయలు   మాత్రమే పలికింది. ఆరంజ్ కలర్ చామంతి కూడా అదే ధర పలుకుతుంది. 

ఇక బంతిపూలు వైట్ కలర్ , ఆరెంజ్ కలర్ కిలో 20 నుంచి 25 రూపాయల వరకు ఉందని చెబుతున్న రైతులు కొద్దిరోజుల కిత్రం రూ.100 రూపాయల నుంచి 150 రూపాయల దాకా ధర పలుకగా, ప్రస్తుతం ధర తగ్గిపోవడంతో, కొనుగోళ్లు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు పూలను మార్కెట్‌ ప్రాంగణంలోని యార్డ్‌లో పడేసి ఆవేదనతో తిరిగి వెళుతున్నారు. 

 ప్రస్తుతం శుభకార్యలు, ఇతర కార్యక్రమాలు లేకపోవడంతో పూల మార్కెట్ లో పూల ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. దీంతో పూల రైతులు వ్యాపారాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగ వేళల్లో కూడా  సరైన ధరలు లేవని .. ఆర్ధికంగా చాలా నష్టపోయామంటూ కన్నీరు పెడుతున్నారు పూల వ్యాపారులు.హోల్ సేల్  మార్కెట్ల నుంచి  అనేక ప్రాంతాలకు పలు రకాల పూలు ఇక్కడ నుండే హోల్ సేల్ గా తీసుకువెళ్లి విక్రయిస్తుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో కుప్పలు తెప్పలుగా పూల బుట్టలు మిగిలి పోవడంతో ఏమి చేయ్యలేక సమీపంలో ఉన్న కాలువలో పువ్వులను నీటిపాలు చేస్తున్నారు.  కనీసం అయ్యప్పల సీజన్ లోనైనా పూల వ్యాపారుల కష్టాలు తీరతాయోమో చూడాలి మరి.. . .