ఎమర్జెన్సీ గొడ్డలితో పైలట్పై దాడి..ఆకాశంలో నరమేధానికి కో పైలెట్యత్నం

ఎమర్జెన్సీ గొడ్డలితో పైలట్పై దాడి..ఆకాశంలో నరమేధానికి కో పైలెట్యత్నం
  • ఫ్లైట్​ను ఇజ్రాయెల్​లో కూల్చివేయాలనేదే అసలు ఉద్దేశం
  • ఫ్లైదుబాయ్ ఘటనపై వరల్డ్​ మీడియాలో సంచలన కథనాలు

అబుదాబి: దుబాయ్ నుంచి ఇజ్రాయెల్​లోని టెల్ అవీవ్ వెళ్తున్న ‘ఫ్లైదుబాయ్’ విమానాన్ని గాల్లోనే కూల్చివేసేందుకు జరిగిన కుట్రపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్​పై కాక్​పిట్ ఎమర్జెన్సీ గొడ్డలి (క్రాష్ యాక్స్)తో దాడి చేసి, విమానాన్ని నియంత్రణలోకి తీసుకునేందుకు యత్నించిన కో-పైలట్​..  ఒమన్ దేశస్తుడైన హమామ్ అల్-హమామిగా అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 

ఈ ఘటన వెనుక ఏదైనా ‘ఉగ్రవాద లక్ష్యం లేదా ప్రమేయం’ ఉందా అనే కోణంలో అధికారికంగా విచారణ జరుపుతున్నట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అటార్నీ జనరల్ హమద్ సైఫ్ అల్ షంసీ ప్రకటించారు. బుధవారం 174 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం 34వేల అడుగుల ఎత్తులో ఉన్నపుడు ఈ దాడి జరిగింది. ఫ్లైదుబాయ్ విమానాన్ని ఇజ్రాయెల్​లో కూల్చివేయాలనే ఉద్దేశంతోనే హమామ్ అల్-హమామి దాడి చేసినట్టు పలు నివేదికలు పేర్కొన్నాయి.

గతంలోనే హమామిపై నిషేధం!

నిందితుడు అల్-హమామి తండ్రి ఒమన్ దేశస్తుడు కాగా, తల్లి సిరియన్​. తీవ్రవాద భావజాలం ఉన్నట్టు గుర్తించడంతో గతంలోనే ఒమన్ ఎయిర్ ఇతనిని పైలట్ శిక్షణ నుంచి తప్పించి, అడ్మినిస్ట్రేటివ్ పోస్టుకు మార్చింది. బ్రిటన్​లోని ఓ​ యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్ మోడ్​లో ఏవియేషన్ మేనేజ్మెంట్ పూర్తిచేశాడు. అలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తికి సరైన తనిఖీలు లేకుండా ఫ్లైదుబాయ్ సంస్థ టెల్ అవీవ్ రూట్​లో ఎలా బాధ్యతలు అప్పగించిందనే అంశంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

నిందితుడు ఈ ఎయిర్​లైన్స్​లో 8 నెలలుగా పనిచేస్తున్నాడు. అతడి సోషల్ మీడియా అకౌంట్స్​లోనూ అనుమానాస్పద అంశాలు ఉన్నట్లు సమాచారం. ఇవన్నీ చూస్తుంటే అతడు ఉద్దేశపూర్వకంగానే దాడి చేసినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

9/11 తరహా విపత్తు తప్పింది’: నెతన్యాహు

పట్టుబడిన తర్వాత ఆ కో-పైలట్ ‘నన్ను చంపేయండి, చంపేయండి!’ అని అరిచాడని, అతడు ఆత్మాహుతి దాడి లక్ష్యంతోనే విమానాన్ని కూల్చాలని చూశాడని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. భారత కెప్టెన్, ప్రయాణికులు మరో 9/11 తరహా పెను విపత్తును అడ్డుకున్నారని ఆయన ప్రశంసించారు.