ఆర్థిక మంత్రికి అప్పులు.. నిర్మలా సీతారామన్ ఆస్తులు ఎంతంటే?

ఆర్థిక మంత్రికి  అప్పులు..  నిర్మలా సీతారామన్ ఆస్తులు ఎంతంటే?

ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన వద్ద డబ్బు లేదంటూ ఇటీవల  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.  2014 నుంచి కేంద్రమంత్రిగా  ఉన్న నిర్మలా సీతారామన్  వద్ద నిజంగానే  ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బులేదా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఒకసారి ఆమె అస్తులు ఎన్నో తెలుసుకుందాం.  2022లో నిర్మల రాజ్యసభ ఎంపీ నామినేషన్‌ ప్రకారం.. ఆమెకు రూ.1.87 కోట్ల స్థిరాస్తులు, రూ.65.55 లక్షల చరాస్తులు ఉన్నాయి. రూ.26.91 లక్షల అప్పు ఉంది. ఇది రెండేళ్ల క్రితం నాటిది. ప్రస్తుతం ఆస్తి విలువ కొంతమేర పెరిగే అవకాశం ఉంది.

నిర్మలా సీతారమన్, ఆమె భర్త పరకాల ప్రభాకర్ కు హైదరాబాద్ సమీపంలోని మంచిరేవులలో రెసిడెన్షియల్ బిల్డింగ్ ఉంది. 2016 నుంచి 2022 నాటికి దీని విలువ రూ. 99.36 లక్షల నుంచి రూ. 1.7 కోట్లకు పెరిగింది. అలాగే కుంట్లూరులో రూ. 17.08 లక్షలు విలువ చేసే వ్యవసాయ భూమి ఉంది. 2016 లో దీని విలువ రూ. 16.02 లక్షలు. 2022 అఫిడవిట్ ప్రకారం నిర్మలా సీతారామన్ వద్ద ఒక స్కూటర్ ఉంది. ఆమెకు సొంతంగా కారు లేదు. 

ALSO READ | ఈవీఎంలు, సోషల్ మీడియా లేకుండా.. బీజేపీ 180 సీట్ల కంటే ఎక్కువ గెలవలేదు: రాహుల్ గాంధీ

2022 నాటికి బంగారం పరిమాణం పెరగలేదు, కానీ పెరిగిన ధరల కారణంగా ఆ బంగారం విలువ దాదాపు రెండింతలు పెరిగి రూ.14.49 లక్షలకు చేరుకుంది. ఇప్పటి ధరల ప్రకారం బంగారం విలువ రూ. 19.4 లక్షల నుంచి రూ. 21.18 లక్షల వరకు ఉంటుంది. ఇక మధ్యతరగతి ప్రజల్లాగే నిర్మలా సీతారమన్ దంపతులు కూడా హోమ్ లోన్ కడుతున్నారు. 2022 నాటికి ఇంకా రూ. 5.44 లక్షల గృహ రుణం చెల్లించాల్సి ఉంది. అలాగే రూ. 2.53 లక్షల ఓవర్ డ్రాఫ్ట్ కూడా ఉంది. రూ. 18.93 లక్షల మార్ట్ గేజ్ లోన్ కూడా ఉంది. ఈ లోన్లు కూడా ఇద్దరి పేర్లతో ఉన్నాయి.