
- శీతాకాల పార్లమెంట్ సమావేశంలో చట్ట సవరణ బిల్లు
న్యూఢిల్లీ: బీమా రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు (ఎఫ్‌డీఐలకు) అనుమతించే బీమా సవరణ బిల్లు రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ బిల్లు ద్వారా ప్రస్తుతం ఉన్న 74శాతం ఎఫ్‌డీఐ పరిమితిని 100శాతానికి పెంచనున్నారు. అయితే, కస్టమర్ల నుంచి సేకరించిన ప్రీమియంను ఇండియాలో ఇన్వెస్ట్ చేసే కంపెనీలే ఎఫ్‌డీఐ పరిమితి పెంచుకోవడానికి అర్హులు.
ఇందుకు సంబంధించి ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ రూల్స్‌ను సులభతరం చేస్తామని నిర్మల అన్నారు. ఇప్పటివరకు బీమా రంగంలో రూ.82 వేల కోట్ల ఎఫ్‌డీఐ వచ్చిందని పేర్కొన్నారు. బీమా చట్టం 1938, ఎల్‌ఐసీ చట్టం 1956, ఐఆర్‌డీఏఐ చట్టం 1999లో సవరణలు చేయనున్నారు. బ్రాంచ్ విస్తరణ, నియామకాలు వంటి నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ఎల్‌ఐసీ చట్టానికి సవరణ చేసి ఈ కంపెనీ బోర్డుకు ఇవ్వనున్నారు.
ఈ మార్పులతో పాలసీదారులు ప్రయోజనం పొందుతారని, కొత్త కంపెనీల ప్రవేశం సులభం అవుతుందని, 2047 నాటికి ‘ఇన్సూరెన్స్ ఫర్ ఆల్’ లక్ష్యాన్ని చేరుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 25 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు, 34 జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు ఉన్నాయి.