ఎఫ్​ఎంసీజీ అమ్మకాలు ఓకే .. డిసెంబరు క్వార్టర్లో పెరిగిన మార్జిన్లు

ఎఫ్​ఎంసీజీ అమ్మకాలు ఓకే .. డిసెంబరు క్వార్టర్లో పెరిగిన మార్జిన్లు
  • గ్రామాల్లో మాత్రం గిరాకీ తక్కువే
  • ఇక నుంచి డిమాండ్​ పెరిగే చాన్స్​ 

న్యూఢిల్లీ: సబ్బులు, షాంపూలు, బిస్కెట్ల వంటి ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎంసీజీ) తయారు చేసే కంపెనీలు డిసెంబర్ క్వార్టర్​లో చాలా విభాగాలలో మెరుగైన మార్జిన్లను సాధించాయి.  అమ్మకాల్లో సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేశాయి. చాలా కంపెనీలు లాభాలను పెంచుకున్నాయి. ఇన్​ఫ్లేషన్​(ధరల భారం ) తగ్గడం వీటికి కలసి వచ్చింది. కొన్ని కంపెనీలు తమ అమ్మకాల్లో తగ్గుదలను ప్రకటించాయి.

ఇవి ధరలను తగ్గించడం ద్వారా వినియోగదారునికి ప్రయోజనం కల్పించాయి. దీంతో వాటి స్థూల అమ్మకాలపై ప్రభావం చూపింది. హెచ్‌‌‌‌‌‌‌‌యూఎల్, ఐటీసీ, మారికో, డాబర్,  గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వంటి కంపెనీలు పట్టణ మార్కెట్లలో మోస్తరు వృద్ధిని కొనసాగించాయి. రాబోయే క్వార్టర్లలో మెరుగుదల ఆశిస్తున్నప్పటికీ, గ్రామీణ భారతదేశం నుంచి వినియోగదారుల డిమాండ్ తగ్గుముఖం పట్టింది.

అంతేకాకుండా, శీతాకాలం ఆలస్యంగా రావడం వల్ల లోషన్లు, నూనెలు,  క్రీమ్‌‌‌‌‌‌‌‌లు వంటి వాటి అమ్మకాలు ఆలస్యంగా మొదలయ్యాయి. హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్​యూఎల్​)కు  డిసెంబరు క్వార్టర్​లో రూ. 2,508 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) వచ్చింది. అమ్మకాల విలువ స్వల్పంగా తగ్గి రూ. 15,259 కోట్లకు చేరుకుంది. గత క్వార్టర్ల మాదిరిగానే సూపర్​మార్కెట్ల వంటి ఆధునిక కమర్షియల్​ఛానెల్స్​ బాగా పని చేస్తున్నాయి. ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాల పెరుగుదల బాగుందని మారికో తెలిపింది.  తాజా క్వార్టర్​లో దీని అమ్మకాలు రెండు శాతం పెరగగా, టర్నోవర్​ మూడు శాతం తగ్గింది.

మాస్ హోమ్,  పర్సనల్ కేర్ ప్రొడక్టులు గ్రామాల్లో,  ప్యాకేజ్డ్ ఫుడ్స్​పట్టణ మార్కెట్లలో ఎక్కువగా అమ్ముడయ్యాయి. ఆశీర్వాద్, సన్‌‌‌‌‌‌‌‌ఫీస్ట్, ఫియామా మొదలైన బ్రాండ్లు ఉన్న ఐటీసీ, డిమాండ్ తక్కువగానే ఉన్నప్పటికీ అమ్మకాల టార్గెట్లను చేరుకున్నామని తెలిపింది. కొన్ని వస్తువుల ధరలు వార్షికంగా క్షీణించినప్పటికీ, కరోనా ముందు ఉన్న స్థాయిలతో పోలిస్తే ధరలు ఇప్పటికీ ఎక్కువే ఉన్నాయని తెలిపింది. అయితే, డిసెంబర్ క్వార్టర్​లో తమ గ్రామీణ డిమాండ్ పట్టణ ప్రాంతాల కంటే 200 బేసిస్ పాయింట్లు పెరిగిందని డాబర్ ఇండియా తెలిపింది. దీని భారతదేశ వ్యాపారం మూడవ క్వార్టర్​లో 6 శాతం వృద్ధితో ముగిసింది.

ఉజాలా, ప్రిల్, మార్గో  ఎక్సో వంటి బ్రాండ్‌‌‌‌‌‌‌‌లను కలిగి ఉన్న జ్యోతి ల్యాబ్స్ కన్సాలిడేటెడ్​ నికర లాభంలో 35 శాతం వృద్ధిని నమోదు చేసింది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రభుత్వ వ్యయం పెరగడం, శీతాకాలపు పంటలు బాగుండటం వల్ల గ్రామీణ మార్కెట్ల నుంచి డిమాండ్ క్రమంగా పుంజుకుంటుందని ఎఫ్​ఎంసీజీ కంపెనీలు భావిస్తున్నాయి.