
- పార్టీ నేతలకు బీజేపీ చీఫ్ అమిత్ షా దిశానిర్దేశం
- 2023లో అధికారంలోకి రావడమే టార్గెట్.. ఇప్పట్నుంచే రంగంలోకి దిగండి
- నాలుగు ఎంపీ సీట్లు, 20% ఓట్లు సాధించినందుకు అభినందనలు
- ఆఫీస్ బేరర్ల భేటీలో తెలంగాణ, బెంగాల్‌పైనే ప్రధాన చర్చ
- మరో ఆరు నెలలు పార్టీ చీఫ్‌గా అమిత్‌షా కొనసాగే అవకాశం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణపై కమలదళం గురిపెట్టింది. పార్టీని కిందిస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. 2023లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో పనిచేయాలని పార్టీ చీఫ్ అమిత్ షా రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. అందుకు ఇప్పట్నుంచే కార్యాచరణ మొదలుపెట్టాలని ఆదేశించారు. ఢిల్లీలో గురువారం ప్రారంభమైన పార్టీ నేషనల్ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. ఇందులో భాగంగా వివిధ పార్టీల్లోని నేతలను పార్టీలోకి తెచ్చే బాధ్యతను సీనియర్ నేత రాంమాధవ్‌కు అప్పగించారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు, 20 శాతం ఓట్లు సాధించినందుకు రాష్ట్ర నాయకత్వాన్ని అభినందించారు. గురువారం జరిగిన భేటీలో జాతీయ ప్రధాన కార్యదర్శులు మురళీధరరావు, రాం మాధవ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌పైనే చర్చ జరిగింది. భేటీ తర్వాత లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో మా పార్టీలో చేరడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు. త్వరలో చేరికలు ఉంటాయన్నారు. జూలై 6 నుంచి దేశవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది. ఇది డిసెంబర్ దాకా కొనసాగుతుంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కొత్త కమిటీలు, కొత్త నాయకత్వ ప్రక్రియ మెదలు పెడుతాం. రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ నమోదు కోసం కమిటీ సభ్యులు ఈ నెల 20 నుంచి 30 వరకు అన్ని ప్రాంతాల్లో తిరుగుతారు’’ అని చెప్పారు. పార్టీ అభివృద్ధి కోసం బూత్ స్థాయి నుంచి బలోపేతం చేస్తామని, అన్ని సామాజిక వర్గాల వారికి ప్రాతినిధ్యం ఇస్తామని వివరించారు. 2023లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రాక్షస పాలన
రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస, నియంతృత్వ పాలన కొనసాగుతోందని లక్ష్మణ్ విమర్శించారు. ‘‘కేసీఆర్ కుటుంబ పాలనకు స్వస్తి పలికే రోజు దగ్గర్లోనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ వైఫల్యాలపై ఉద్యమం ప్రారంభిస్తాం. ఎమ్మెల్యేల ఫిరాయింపులు మంచిది కాదు. అభద్రతా భావంతో కేసీఆర్ సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొంటున్నారు. సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్టు కేసీఆర్.. కేంద్ర పథకాలను కూడా తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు’’ అని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పారు.
మరో ఆరు నెలల పాటు బీజేపీ చీఫ్ అమిత్‌షానే
న్యూఢిల్లీ: బీజేపీ నేషనల్ చీఫ్ పగ్గాలు ఎవరు చేపట్టనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు అమిత్‌షా.. అదే పదవిలో మరో ఆరునెలలు కొనసాగుతారని తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబరులో మూడు రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికలు పూర్తయ్యేవరకు షానే బీజేపీ ప్రెసిడెంట్‌గా కొనసాగుతారని సమాచారం. వచ్చే ఏడాది ప్రారంభంలోనే కొత్త చీఫ్ నియమితులవుతారని తెలుస్తోంది. మోడర్న్ పోలిటిక్స్ లో చాణుక్యుడుగా చెప్పుకునే అమిత్ షా బీజేపీకి అనూహ్య విజయాలను అందించారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించింది. పార్టీ చీఫ్‌గా అమిత్ షాకు ఇదొక అపూర్వ విజయమనే చెప్పాలి. ఇదే ఊపుతో ఈ ఏడాదిలో జరగనున్న హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాషాయపార్టీ భారీ మెజార్టీ సాధించాలన్నది హైకమాండ్ వ్యూహం. దీనికి అనుగుణంగానే షా సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం కావాలని బీజేపీ భావిస్తోంది. ఈ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు పూర్తయిన తర్వాతనే బీజేపీలో ఆర్గనైజేషనల్ ఎన్నికలు ప్రారంభమవుతాయి. అమిత్ షా కేంద్ర కేబినెట్‌లో చేరడంతో.. బీజేపీకి కొత్త చీఫ్ వస్తారని అంతా భావించారు. గతంలో ఇలాగే జరిగింది. 2014లో నరేంద్రమోడీ మోడీ సర్కార్‌లో రాజ్‌నాథ్ సింగ్ హోం మంత్రిగా నియమితులవడంతో ఆయన పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ స్థానంలో అమిత్ షా నియమితులయ్యారు. మరోవైపు, న్యూఢిల్లీలో రెండు రోజులపాటు కొనసాగనున్న పార్టీ నేషనల్ ఆఫీస్ బేరర్ల సమావేశం గురువారం ప్రారంభమైంది. మొదటిరోజు మెంబర్‌షిప్ డ్రైవ్‌పైనే ప్రధానంగా చర్చించారు. బీజేపీలో 11 కోట్లమంది సభ్యులున్నారు. 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందే మరింత మందిని పార్టీలో చేర్చాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. మెంబర్‌షిప్ డ్రైవ్ బాధ్యతల్ని పార్టీ వైస్ ప్రెసిడెంట్ శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు అప్పగిస్తూ సమావేశంలో నిర్ణయించారు. వివరాలను బీజేపీ జనరల్ సెక్రటరీ భూపేంద్ర యాదవ్ మీడియాకు వివరించారు. అమిత్ షా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ భేటీలో జనరల్ సెక్రటరీలు, పార్టీ స్టేట్ చీఫ్‌లు పాల్గొన్నారన్నారు.