సెన్సిటివ్ ప్రాంతాలపై ఫోకస్ పెట్టాలి : ఈసీ

సెన్సిటివ్ ప్రాంతాలపై ఫోకస్ పెట్టాలి  : ఈసీ

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం పనికి రాదని జిల్లా ఎన్నికల అధికారులకు, ఎస్పీలకు, పోలీస్​ కమిషనర్లకు ఈసీ స్పష్టం చేసింది. ఎలాంటి ఫిర్యాదులొచ్చినా వెంటనే స్పందించాలని సూచించింది. ఎన్నికల ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఉద్యోగాలకే ఇబ్బంది వస్తుందని, జాగ్రత్తగా ఉండాలని వివరించింది. అన్ని పార్టీలు, అభ్యర్థులతో ఒకేలా వ్యవహరించాలని పక్షపాత వైఖరి ఉండొద్దని తెలిపింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్​కమిషనర్లతో సమావేశమైంది. 

జిల్లాల వారీగా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులతో ఆ జిల్లాలో ఎన్నికల సన్నద్ధత, నిర్వహణపై సమీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని జిల్లాల పవర్​పాయింట్​ ప్రజెంటేషన్లు చూశారు. లోటుపాట్లు అడిగి తెలుసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలా వ్యవహరించాలో దిశానిర్దేశం చేశారు. ఇతర రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన జిల్లాల సమన్వయం, డబ్బు, మద్యం పంపిణీపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఈసీ బృందం వివరించింది.  

కొందరిపై ఫిర్యాదులు ఉన్నయ్​

కొందరు ఐఏఎస్​ అధికారులు, పోలీసు ఆఫీసర్లపై కాంగ్రెస్ ​చేసిన ఆరోపణల మీద కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఆరా తీసినట్లు తెలిసింది. అందులో ఎవరెవరు ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా ఉన్నారనేది సీఈఓను అడిగి తెలుసుకుంది. ఆరోపణలు ఎక్కువ వచ్చిన ఆఫీసర్లతో కంప్లయింట్స్ వస్తున్నాయ్​ ? జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు సమాచారం. 

ఓటర్ ​అవేర్నెస్​

హైదరాబాద్​లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పైన ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఓటర్ అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహిచింది. ఈ సందర్భంగా.. వాకథాన్, సైక్లింగ్ కార్యక్రమం చేపట్టింది. సైక్లింగ్ టు ఓటు,- వాక్ టు ఓటు పేరుతో వాకథాన్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజీవ్ కుమార్, కమిషనర్లు అరుణ్ గోయల్, అనూప్ చంద్ర పాండేలు పాల్గొన్నారు.