చాలా కుటుంబాల్లో ఆర్థిక వ్యవహారాలు చెల్లాచెదురుగా ఉంటాయి. బ్యాంక్ అకౌంట్లు, ఇన్వెస్ట్‌మెంట్లు, లోన్లు, ఇన్సూరెన్స్ పాలసీలు.. ఇలాంటివన్నీ వివిధ యాప్‌లు, అకౌంట్లలో ఉంటాయి. తల్లిదండ్రులు చేసిన డిపాజిట్లు పిల్లలకు తెలియవు. భర్త చేసిన ఇన్వెస్టిమెంట్లు భార్యకు తెలియవు. పైగా చాలామంది ఇలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ.. కుటుంబ పెద్ద అకస్మాత్తుగా చనిపోతే అప్పుడు వాటి ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఎన్ని బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి? ఎన్ని లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి? పేరెంట్స్ మా పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్స్ ఎంత చేశారు?.. ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతాయి. అలాంటి వాళ్లకు ఫోలో భరోసాని ఇస్తుంది. ఇది పూర్తి ఫైనాన్షియల్ లైఫ్‌ని ఫోన్ స్క్రీన్ మీదే చూపించేస్తుంది. దీన్ని మున్మున్ దేశాయ్, విశాల్ పురోహిత్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి 2024లో స్థాపించారు. ఫోలో(FOLO) అంటే ఫ్యామిలీ ఆఫ్ లవ్డ్ వన్స్ అని అర్థం. ఇది ఇండియాలోని మొదటి నెట్‌వర్త్ మేనేజ్‌మెంట్ యాప్. ఇది యూజర్ల ఆస్తులు, బాధ్యతలు, ఇన్సూరెన్స్‌లను ఒకే చోట సమన్వయం చేసి, రియల్-టైమ్ నెట్‌వర్త్‌ను చూపిస్తుంది.
ఆలోచన ఎందుకొచ్చింది?
మున్మున్ దేశాయ్ వ్యక్తిగత అనుభవాలే ఫోలో స్థాపనకు అడుగులు పడేలా చేశాయి. 2022లో ఆమె కజిన్ బ్రదర్ అనుకోకుండా చనిపోయాడు. ఆ టైంలో వాళ్ల కుటుంబ ఆస్తులు, అప్పుల వివరాలు సేకరించడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మున్మున్‌కు ఉన్న అనుభవం, ఫైనాన్షియల్ స్కిల్స్‌తో బ్యాంకు అకౌంట్స్, పాలసీలు, ఇ–మెయిల్స్, కంప్యూటర్ ఫోల్డర్స్‌లో ఉన్న డాక్యుమెంట్స్.. ఇలా అన్నింటినీ ఒకచోటకు చేర్చి లెక్క తేల్చింది. తనకు ఆర్థిక రంగంలో అనుభవం ఉంది కాబట్టి ఈ పనులన్నీ ఈజీగా చేసింది. అవగాహన లేనివాళ్ల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న ఆమెలో తలెత్తింది. ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ స్టార్టప్ పుట్టింది. మొదట్లో మున్మున్ ఈ సమస్య మహిళలకు మాత్రమే ఉంటుందని భావించేది. అంటే ఆస్తుల వివరాలు చెప్పకుండా చనిపోయిన భర్తల ఆస్తులను క్లెయిమ్ చేసుకోవడంలో భార్యలు ఇబ్బందులు పడతారని నమ్మేది. కానీ.. దీనిపై రీసెర్చ్ చేశాక ఆమెకి ఈ సమస్య ఆడవాళ్లకు మాత్రమే కాదు.. దేశం అంతటా ఎన్నో కుటుంబాలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయని తెలిసింది. వెంటనే ఉద్యోగానికి రిజైన్ చేసి ఫోలోపై దృష్టి పెట్టింది.
యాప్ డెవలప్‌మెంట్స్...
నెట్‌వర్త్ ట్రాకింగ్ అప్లికేషన్ డెవలప్మెంట్ 2024లో ప్రారంభమైంది. పది మంది ఇంజనీర్ల బృందం ఫోలోని నిర్మించింది. ముందు బీటా వెర్షన్స్‌ని తీసుకొచ్చారు. ఏప్రిల్ 2025లో అందరికీ అందుబాటులోకి వచ్చింది. కొన్ని వారాల్లోనే 60 వేల కంటే ఎక్కువమంది ఈ ప్లాట్‌ఫామ్‌లో చేరారు. ప్రస్తుతం యాప్ సర్వీసులను ఉచితంగానే అందిస్తున్నారు.
యాప్ ఎలా పనిచేస్తుంది?
ఫోలో యాప్ 350+ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్లతో కనెక్ట్ అయ్యింది. యూజర్ కన్సెంట్‌తో డేటాను సమన్వయం చేసి, నెట్‌వర్త్‌ను రియల్-టైమ్‌లో చూపిస్తుంది. పైగా ఇందులో మాన్యువల్ అప్‌డేట్స్ భారం కూడా ఉండదు. ఆటోమేటిక్ సింకింగ్‌తో సమాచారాన్ని తీసుకుంటుంది. ఎర్రర్స్‌ని తగ్గిస్తుంది. టైంని ఆదా చేస్తుంది. సెబీ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుంది.
ఆస్తులు, బాధ్యతలు: బ్యాంక్ అకౌంట్లు, ఇన్వెస్ట్‌మెంట్లు (స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్), లోన్లు, క్రెడిట్ కార్డులు, రిటైర్‌మెంట్ ఫండ్స్ (పీఎఫ్, ఎన్‌పీఎస్ లాంటివి) మొదలైనవాటి వివరాలు అందిస్తుంది.
►ALSO READ | రూ.35 వేల కోట్ల పెట్టుబడితో గుజరాత్‌లో మారుతి కొత్త ప్లాంట్.. ఇక 10 లక్షల వాహనాలను ఉత్పత్తి ..
ఇన్సూరెన్స్: హెల్త్, లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్‌లను ఒకే చోటకి చేర్చి, వాటి ప్రీమియం చెల్లించాల్సిన రోజుకు ముందే అలర్ట్స్ పంపుతుంది.
షేరింగ్: నలుగురు కుటుంబ సభ్యులకు డేటాని సేఫ్‌గా షేర్ చేయొచ్చు. ఎప్పుడైనా రివోక్ చేయొచ్చు.
కాలిక్యులేటర్లు: నెట్‌వర్త్, ఇన్సూరెన్స్ కవర్, ఎమర్జెన్సీ ఫండ్, రిటైర్‌మెంట్ రెడీనెస్ లాంటివాటిని ఆటోమెటిక్‌గా కాలిక్యులేట్ చేసి చూపిస్తుంది.
అకౌంట్ హెల్త్ స్కాన్: మిస్సింగ్ నామినీలు, కేవైసీ గ్యాప్‌లు మొదలైనవి గుర్తించి స్కోర్ ఇస్తుంది.
18 ఏండ్ల అనుభవం
మున్మున్, విశాల్ పురోహిత్‌తో కలిసి ఫోలోకి పునాదులు వేసింది. ఇది ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. మున్మున్ దేశాయ్ ప్రస్తుతం కంపెనీకి సీఈవోగా పనిచేస్తోంది. ఆమెకు ఫైనాన్స్ రంగంలో 18 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. దాల్మియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో చదువుకుంది. తర్వాత ‘బాట్లివాలా అండ్ కరణి సెక్యూరిటీస్’లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎదిగింది. ‘టాప్ 100 విమెన్ ఇన్ ఫైనాన్స్’,
‘40 అండర్ 40 ఇన్వెస్ట్‌మెంట్ ప్రొఫెషనల్’ అవార్డులు గెలుచుకుంది. ఏంజెల్ ఇన్వెస్టర్‌గా కూడా గుర్తింపు దక్కించుకుంది.
కంపెనీ కో–ఫౌండర్ విశాల్ పురోహిత్ ఒక సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్. పూణే యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పట్టా అందుకున్నాడు. ఆయన వూకర్ అనే రిటైల్ ఆపరేషన్స్ ప్లాట్‌ఫామ్‌కి ఫౌండర్. స్కాన్‌రే టెక్నాలజీస్‌లో బోర్డ్ మెంబర్, గ్యారేజ్ అగైన్ వెంచర్స్ ఫౌండర్. ఏంజెల్ ఇన్వెస్టర్.
