
రెస్టారెంట్లు, హోటళ్లలోకంటే మంచి వంటలు చేసే షెఫ్‌లు ఇళ్లలోనే ఉంటారు. అమ్మ, బామ్మలు చేసే వంటలు రుచిగా ఉంటూనే ఆరోగ్యాన్ని అందిస్తాయి. అందులో కొందరు మరీ అద్భుతంగా వంట చేస్తుంటారు. అయితే ఇలాంటి వాళ్లలో చాలామంది వంటలు ఇంటికే పరిమితమవుతాయి. బాగా వంట చేసేవాళ్లు తమ చేతి వంటల్ని అందరికీ పరిచయం చేసే అవకాశం కల్పిస్తోంది రచనా రావ్. బెంగళూరులో ‘ఫుడ్బడ్డీ.ఇన్’ వెబ్సైట్ ద్వారా బామ్మలు, గృహిణలకు ఉపాధి కల్పిస్తోంది. నగరవాసులకు ఇంటి రుచిని పరిచయం చేస్తోంది.
ముంబైకు చెందిన రచనా రావ్ 2006లో బెంగళూరులోని ఐఐఎమ్‌లో ఎంబీఏ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత మన దేశంతోపాటు అమెరికాలో కొన్నేళ్లపాటు ఐటీ కంపెనీల్లో పని చేసింది. తిరిగి ఇండియాకి వచ్చిన తర్వాత బెంగళూరులోని ఒక గేమింగ్ సంస్థలో పనిచేసింది. అప్పుడు ఆఫీసులో పని ఒత్తిడి మూలంగా ఇంట్లో వంట చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో రచన, ఆమె భర్త అఖిల్ సేతురామన్ హోమ్ ఫుడ్ కోసం వెతికేవాళ్లు. వీళ్లతోపాటు స్నేహితుడు అనూప్ కూడా మంచి ఫుడ్ కోసం చూసేవాళ్లు.
ముగ్గురితోనే మొదలు…
అలా వెతుకుతున్నప్పుడు రచనకు తట్టిన ఆలోచన ఇది. ఇళ్లల్లో చాలామంది అద్భుతంగా వంటలు చేస్తుంటారు. వాళ్లలో కొందరికి తమ చేతి వంటను ఇతరులకు రుచి చూపించాలని, దాని ద్వారా ఎంతో కొంత ఆదాయం పొందాలని ఉంటుంది. అయితే దీనికి సరైన మార్గం దొరక్క అలాగే ఉండిపోతారు. అలాంటివాళ్లకు వారధిగా ఒక వెబ్సైట్ ప్రారంభించాలనుకుంది రచన. అంటే వంట చేసే గృహిణులు, బామ్మలను గుర్తించి వాళ్లతో ఇంట్లోనే వంట చేయించి, ఫుడ్ డెలివరీ ఇచ్చే ఏర్పాటు చేయిస్తే బాగుంటుందని భావించింది. ఈ ఆలోచనకు రచన భర్త అఖిల్, వాళ్ల స్నేహితుడు అనూప్ ఓకే అన్నారు. ఈ ముగ్గురూ కలిసి బెంగళూరులో 2015లో ‘ఫుడ్బడ్డీ.ఇన్’ సైట్‌ను ప్రారంభించారు.
బామ్మలే షెఫ్‌లుగా….
ఇప్పటికే కొన్ని ఆన్లైన్ సంస్థలు ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తున్నాయి. అయితే అవి రెస్టారెంట్లు, హోటళ్ల నుంచి మాత్రమే సేవలందిస్తున్నాయి. అందుకే గృహిణులతో చేసే తమ ప్రయత్నం విజయవంతమవుతుందని అనుకుంది రచన. స్థానికంగా కొంతమంది వంట చేసే మహిళలను సంప్రదించి, వాళ్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో సాధారణ గృహిణులతోపాటు అరవై ఏళ్లు పైబడిన మహిళలు కూడా ఎక్కువగా ఉన్నారు. వీళ్లు చేసిన వంటలు దగ్గర్లో ఉండే ఆఫీసులు, అపార్టుమెంట్లకు అందిస్తారు. దాదాపు నాలుగు వందల అపార్టుమెంట్లకు ఫుడ్ సరఫరా చేస్తున్నారు.
రెండు వేల మందికి ఉపాధి…
ఈ ప్రయత్నం సక్సెస్ కావడంతో వంట చేసే మహిళల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం దాదాపు రెండు వేల మందికి పైగా మహిళలు ఇలా వంట చేసి ఉపాధి పొందుతున్నారు. పైగా దీనికి పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేదు. ఇంట్లోనే వీలున్న టైమ్‌లో వంట చేసి అందిస్తున్నారు. వీళ్లలో కొందరు వేరే ఉద్యోగాలు చేసి మానేసిన వాళ్లు కూడా ఉన్నారు. వంటలు చేయడం ద్వారా నెలనెలా వేలల్లో ఆదాయం పొందుతున్నారు. కొందరు మహిళలు నెలకు పాతిక వేల వరకు సంపాదిస్తున్నారు. ఇప్పటివరకు తమ సంస్థ ద్వారా రెండున్నర లక్షల భోజనాలు అందించారు వీళ్లు.
సంతోషంగా ఉంది….
‘గృహిణులకు ఇలా ఉపాధి కల్పిస్తున్నందుకు ఆనందంగా ఉంది. వంట చేసే మహిళల ఇళ్లకు దగ్గరగా ఉండేవాళ్లు కొన్నిసార్లు వాళ్లింటికే వెళ్లి తింటున్నారు. నేరుగా వంటను మెచ్చుకుంటే వాళ్లు పొందే ఆనందం మాటల్లో చెప్పలేనిది. కొందరికి ఉపాధి కల్పిస్తూ, మరికొందరికి మంచి ఫుడ్ అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని చెప్పింది రచన.