- జూన్ క్వార్టర్‌లో రూ.2 కోట్ల ప్రాఫిట్ సాధించిన కంపెనీ
- రెవెన్యూ రూ. 2,416 కోట్లు
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్– జూన్ క్వార్టర్ (క్యూ1) లో రూ.2 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కిందటేడాది ఇదే క్వార్టర్‌లో రూ.186 కోట్ల నష్టాన్ని, ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌లో రూ.189 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. జూన్ క్వార్టర్‌లో కంపెనీకి రూ.2,416 కోట్ల రెవెన్యూ రాగా, ఇది కిందటేడాది జూన్ క్వార్టర్‌లో వచ్చిన రూ.1,414 కోట్ల కంటే 71 శాతం ఎక్కువ. జొమాటో షేరు గురువారం సెషన్‌లో 2 శాతం లాభపడింది. క్విక్ కామర్స్ బిజినెస్ (బ్లింకిట్) మొదటిసారిగా జూన్ క్వార్టర్‌లో లాభాల్లోకి వచ్చిందని జొమాటో ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ఇబిటా రూ.12 కోట్లుగా ఉంది. కిందటేడాది జూన్ క్వార్టర్‌లో రూ.152 కోట్ల ఇబిటా నష్టాన్ని కంపెనీ ప్రకటించింది.
‘కీలక రోల్స్‌లో సరియైన వ్యక్తులను పెట్టి మా బిజినెస్‌ను సులభతరం చేస్తున్నాం. రిస్క్ చేసి తీసుకున్న నిర్ణయాలన్నీ అంచనావేసిన దాని కంటే వేగంగా మా బిజినెస్‌ను మార్చాయి’ అని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ అన్నారు. ఇక్కడ నుంచి తమ బిజినెస్ ప్రాఫిటబుల్‌గా ఉంటుందని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అక్షంత్ గోయల్ అన్నారు. కనీసం ఇంకో రెండేళ్ల వరకు రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 40 శాతం గ్రోత్‌ను నమోదు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో జొమాటో గ్రాస్ ఆర్డర్ వాల్యూ (జీఓవీ) రూ.7,318 కోట్లకు ఎగిసింది. కిందటేడాది ఇదే క్వార్టర్‌లో ఈ నెంబర్ రూ.6,425 కోట్లుగా ఉంది. సగటు ఆర్డర్ వాల్యూ పెరిగిందని, ఆర్డర్ల సంఖ్య కూడా పెరిగిందని జొమాటో పేర్కొంది.
