పైసలు అవసరం లేదు..ప్లాస్టిక్ ఇస్తే చాలు

పైసలు అవసరం లేదు..ప్లాస్టిక్ ఇస్తే చాలు

మీ దగ్గర డబ్బుల్లేవా..బాగా ఆకలేస్తుందా..ఏం పర్లేదు. ఆ హోటల్లో ఫ్రీగా ఫుడ్ తినొచ్చు. కాకపోతే డబ్బులకు బదులు ప్లాస్టిక్ ఇస్తే సరిపోతుంది. అది కూడా వాడిపారేసిన ప్లాస్టిక్ ఇచ్చి..కడుపు నింపుకోవచ్చు. అవును ఇది నిజం. కానీ మన రాష్ట్రంలో మాత్రం కాదు. 

హోటల్ ఎక్కడుదంటే..
ప్లాస్టిక్తో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది.  ముఖ్యంగా యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ ద్వారా ప్రకృతికి హాని కలుగుతోంది. రోడ్లపై ఎక్కడ చూసిన ప్లాస్టిక్ కవర్లు, ఇతర ప్లాస్టిక్ చెత్తా చెదారం దర్శనిమిస్తుండటంతో..గుజరాత్ ప్రభుత్వం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ ఉత్పత్తులపై జులై 1 నుంచి నిషేధం విధించింది. ఇందులో భాగంగా గుజరాత్లోని జునాగఢ్ ప్రాంతంలో  జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఓ కేఫ్ను ప్రారంభించింది.   ఇక్కడ డబ్బులకు బదులు ఒక్కసారి వాడిపారేసిన చెత్త  ఇస్తే ఫుడ్ సరఫరా చేస్తారు. ఇక ఈ కేఫ్లోని ఫుడ్ తయారీలో   సహజసిద్ధంగా పండించిన ముడి సరుకులను వినియోగిస్తారు. సర్వోదయ సాక్షి మండల్ ఈ కేఫ్ నిర్వహిస్తోంది. ఈ రెస్టారెంట్ సమీకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఓ ఏజెన్సీ కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. 

జూన్ 30న నాచురల్ ప్లాస్టిక్  కేఫ్ను గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రారంభించారు.  ఈ సందర్భంగా  నాచురల్ ప్లాస్టిక్ కేఫ్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కేఫ్లో ప్రజలకు సహజసిద్దంగా వండిన ఆహారం లభిస్తుందన్నారు. ఒక్కసారి వినియోగించిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఇచ్చి..అందుకు సరిపడా ఫుడ్ను తినొచ్చని ఆయన చెప్పారు.  స్వచ్ఛమైన, పరిశుభ్రమైన పట్టణంగా జునాగఢ్ను తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే ఈ కేఫ్ ను ప్రారంభించామని జునాగడ్ కలెక్టర్ రచిత్ రాజ్ తెలిపారు. దీని వల్ల ప్రజల్లో ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. 


 
ఎంత ప్లాస్టిక్కు ఎంత ఆహారం..
నాచురల్ ప్లాస్టిక్ కేఫ్లో 500 గ్రాముల ప్లాస్టిక్ వ్యర్థాలకు గ్లాసు నిమ్మరసం ఇస్తారు. కిలో ప్లాస్టిక్కు ఒక పోహ అందిస్తారు. ప్లాస్టిక్ ఎక్కువగా ఉంటే... పెద్ద గిన్నెలో ఇతర ఆహార పదార్థాలను వడ్డిస్తారు. ఇక ఈ కేఫ్లో తమలపాకు, గులాబీ, అంజీర్ , బెల్లంతో తయారు చేసిన వంటకాలు  ప్రత్యేకం. అంతేకాదు గుజరాత్ సంప్రదాయ వంటకాలన్నీ ఇక్కడ లభిస్తాయి. ఈ ఆహార పదార్థాలన్నీ..మట్టి పాత్రల్లోనే వడ్డిస్తారు. ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే కేఫ్కు అనూహ్య స్పందన లభించింది. స్థానికులు పెద్ద సంఖ్యలో ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొచ్చి..ఆహారాన్ని రుచిచూస్తున్నారు.  

ఆహార ప్రియులారా..ఇంకెందుకు ఆలస్యం..మీరు కూడా అలా ఎప్పుడైనా గుజరాత్ రాష్ట్రం జునాగడ్కు వెళ్తే మాత్రం తప్పకుండా ఈ నాచురల్ కేఫ్ను సందర్శించండి.  ముందే ప్లాన్ చేసుకుని సంచుల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నింపేసి..కేఫ్కు అందించండి..సంప్రదాయ వంటకాలను రుచిచూసేయండి.