
నాగర్‌కర్నూల్/నాగర్‌కర్నూల్ టౌన్, వెలుగు: కలుషితాహారం తినడంతో 111 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ పట్టణం ఉయ్యాలవాడలోని జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకులంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. శనివారం సాయంత్రం స్నాక్స్ కింద స్టూడెంట్లకు పకోడి ఇవ్వగా.. రాత్రి భోజనంలో క్యాబేజీ కూర, పెరుగు ఇచ్చారు. తర్వాత స్టూడెంట్లు వాంతులు చేసుకోవడంతో పాటు కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారు. దీంతో గమనించిన గురుకులం సిబ్బంది 108లో జిల్లా జనరల్ హాస్పిటల్‌కు తరలించారు.
మొత్తం 111 మంది బాలికలు అస్వస్థతకు గురి కాగా.. 79 మంది కోలుకోవడంతో వారిని ఆదివారం డిశ్చార్జ్ చేశారు. మిగిలిన వారికి ట్రీట్‌మెంట్ కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి, బీసీ గురుకుల సంక్షేమ కార్యదర్శి సైదులు, అడిషనల్ కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, ఎస్పీ వైభవ్ గైక్వాడ్, డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి హాస్పిటల్‌కు వచ్చి పరిస్థితి సమీక్షించారు. అనంతరం గురుకులంలో ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించారు.
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం : మంత్రి జూపల్లి
బీసీ గురుకులంలో స్టూడెంట్లు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం హాస్పిటల్‌కు వచ్చి స్టూడెంట్లను పరామర్శించారు. అనంతరం గురుకులానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వంట ఏజెన్సీలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఆయన వెంట నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి ఉన్నారు.
స్టూడెంట్లను పరామర్శించిన లీడర్లు
అస్వస్థతకు గురై హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న స్టూడెంట్లను మాజీమంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పరామర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఘటనలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా స్వీకరించాలని కోరారు.
సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలోనే ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ చేతగానితనం, నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.