నార్కట్‌పల్లి, వెలుగు: చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కలెక్టర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఆహార పరిరక్షణ శాఖ ఆఫీసర్లుఆహార భద్రత పర్యవేక్షణ తనిఖీలు నిర్వహించారు. శనివారం ఆలయ ఈవో, సిబ్బందితో కలిసి ప్రసాదం తయారీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. తయారీ విధానాలు, పరికరాల శుభ్రత, నీటి వినియోగం, వ్యర్థాల నిర్వహణ, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రతలను పరిశీలించారు.
భక్తులకు అందిస్తున్న లడ్డూ, పులిహోరలను బ్యాచ్ వారీగా తనిఖీ చేసి ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ మొబైల్ ప్రయోగశాల ద్వారా తక్షణ స్పాట్ పరీక్షలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో తినుబండారాలు విక్రయించే వ్యాపారులను కూడా తనిఖీ చేసి ఆహార భద్రత సూచనలు చేశారు. గుట్కా, పొగాకు వంటి నిషేధిత పదార్థాలతో ఆలయ పరిసరాలను అపరిశుభ్రం చేస్తే ఆహార పరిరక్షణ ప్రమాణాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జ్యోతిర్మయి హెచ్చరించారు.
