దండుకుంటున్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు .. చేసిన తనిఖీలు 9,806 ..తీసుకున్న శాంపిల్స్ 3,500 !

దండుకుంటున్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు .. చేసిన తనిఖీలు 9,806 ..తీసుకున్న శాంపిల్స్ 3,500 !
  • కల్తీ ఫుడ్ ​అని రిపోర్ట్​ వచ్చినవి 25 మాత్రమే 
  •  తనిఖీలకు వెళ్లే ముందే సమాచారం 
  • డీల్​ ఓకే అయితే నో శాంపిల్స్ ​కలెక్షన్​
  • తీసుకున్నా.. ల్యాబ్​కు పంపే ముందు తారుమారు 

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హోటల్స్, రెస్టారెంట్లు, ఇతర ఫుడ్ వెండర్లపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తుండగా.. తనిఖీలు చేసి ఆమ్యామ్యాలతో సరిపెడుతున్నారని తెలుస్తోంది. 

ఫుడ్ శాంపిల్స్ సేకరణ దగ్గరి నుంచి మొదలుకుంటే ల్యాబ్ రిపోర్టుల వరకు మొత్తం అంతా మ్యానేజ్​చేస్తున్నారని తెలుస్తోంది. ఇది నిజమే అనడానికి ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. గతేడాది జీహెచ్ఎంసీలో 9,806 హోటల్స్, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీల్లో తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. కేవలం 3587 ఫుడ్ శాంపిల్స్ మాత్రమే సేకరించారు. 

అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే  వీటిలో కేవలం 25 శాంపిల్స్ మాత్రమే కల్తీ(అన్‌‌‌‌సేఫ్) ఫుడ్​గా తేలగా, మిగతా 53 నాణ్యత లేనివిగా ల్యాబ్ రిపోర్ట్​వచ్చింది. ఇక ఈ ఏడాది మూడు కార్పొరేషన్ల పరిధిలో ఇప్పటి వరకు 3,500 వరకు తనిఖీలు చేయగా, ఇందులో 2,200 శ్యాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్ కి పంపారు. 

ఇందులో పదుల సంఖ్యలోనే అన్ సేఫ్ గా రిపోర్ట్​వచ్చింది. వేల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినా, కల్తీ ఆహారం కేసులు ఇంత తక్కువగా నమోదవ్వడం వెనుక భారీ అవినీతి జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫుడ్ వెండర్లకు అనుకూలంగా రిపోర్టులు వచ్చేలా అధికారులు శాంపిల్స్‌‌‌‌ మార్చేస్తున్నారని, నాణ్యమైన పదార్థాలనే ల్యాబ్‌‌‌‌కు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఫిర్యాదులే ఆదాయంగా..

ఫుడ్ సేఫ్టీపై వస్తున్న ఫిర్యాదులనే  ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదాయంగా మార్చుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కంప్లయింట్స్​వచ్చిన వెంటనే కాకుండా ఒకటి, రెండు రోజుల తర్వాత తనిఖీలకు వెళ్తున్నారు. 

రైడ్స్​గురించి సంబంధిత ఫుడ్ వెండర్ కు ముందే సమాచారం ఇస్తున్నారని, అంతా ఓకే అయితే, శ్యాంపిల్స్ తీసుకోవడం ఏమీ ఉండదని, ఒకవేళ తేడా వస్తే శాంపిల్స్​లిఫ్ట్​చేస్తున్నట్టు తెలుస్తోంది. గతేడాది జీహెచ్ఎంసీలో 9,806 చోట్ల తనిఖీలు చేసి 3,587 శాంపిల్స్​తీసుకోవడం, ఈ ఏడాది 3,500 తనిఖీలు చేసి 2,200 శాంపిల్స్​మాత్రమే తీసుకోవడం ఫుడ్​సేఫ్టీ అవినీతికి బలాన్ని చేకూరుస్తున్నదంటున్నారు. ఇక కొందరికి తప్పని పరిస్థితుల్లో నోటీసులు జారీ చేస్తున్నారని, ఇలా గతేడాది ఇంప్రూమెంట్ కోసం 399, ఇతర నోటీసులు 1141 జారీ చేశారని 
సమాచారం.  

పదేండ్లలో ఒక్కరికీ శిక్ష పడలే..

ఫుడ్ శ్యాంపిల్స్ లో అన్ సేఫ్ అని తేలితేనే వెండర్​కు శిక్ష పడుతుంది. అన్ సేఫ్ ఫుడ్ అని రిపోర్టు వస్తే  6 నెలల వరకు జైలు శిక్ష, రూ. లక్ష వరకు ఫైన్​పడుతుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడితే ఏడాది వరకు జైలు, రూ.3 లక్షల వరకు జరిమానా వేస్తారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేదా అవయవాలు దెబ్బతినడం వంటివి జరిగితే ఆరేండ్ల వరకు  జైలు, రూ. 5 లక్షల వరకు ఫైన్​విధిస్తారు.

 చనిపోతే కనీసం ఏడేండ్ల నుంచి జీవితకాల శిక్ష వేస్తారు. అలాగే, రూ.10 లక్షల వరకు జరిమానా వేస్తారు. ఒకవేళ క్వాలిటీ సరిగ్గా లేదని తేలితే పెనాల్టీతో సరిపెట్టొచ్చు. ఇలా గత పదేండ్లలో ఎవరికీ జైలు శిక్ష పడలేదు. పదేండ్ల క్రితం 14 మందికి జైలు శిక్ష పడింది. ఆ తర్వాత కోర్టుల వరకు కేసులు వెళ్లినా శిక్షలు పడలేదు.