పానీ పూరీలో కేన్సర్ కలర్స్!

పానీ పూరీలో  కేన్సర్ కలర్స్!
  • హానికరమైన కృత్రిమ రంగులు కలుపుతున్న వ్యాపారులు
  • ఫుడ్స్​లో సింథటిక్ కలర్స్ వాడకంపై కర్నాటకలో నిషేధం 
  • రాష్ట్రవ్యాప్తంగా 79 చోట్ల శాంపిల్స్ సేకరణ
  • ఒక్క బెంగళూరులోనే 19 శాంపిల్స్​లో కేన్సర్ కారక రంగులు గుర్తింపు

బెంగళూరు: కమ్మ కమ్మగా నోరూరించే పానీ పూరీలు.. వాటితోపాటే ఇచ్చే పానీ, సాస్​లతో కేన్సర్ ప్రమాదం పొంచి ఉందట. రంగు, రుచి కోసం వీటిలో ప్రమాదకరమైన సింథటిక్ కలర్స్​ను కలుపుతుండటమే ఇందుకు కారణమని కర్నాటక హెల్త్ ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన, కేన్సర్​కు కారణమయ్యే కృత్రిమ రంగులను ఫుడ్స్ లో కలపడంపై నిషేధం విధించిన కర్నాటక హెల్త్ డిపార్ట్​మెంట్ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ఫుడ్ శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేసింది. దీంతో పానీ పూరీలో సింథటిక్ కలర్స్ కలుపుతున్నారని, వీటితో కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ విభాగం ఎక్స్ పర్ట్ లు గుర్తించారు. గప్​చుప్ లతో పాటు  గోబీ మంచూరియా, కబాబ్స్ వంటి వంటకాల్లోనూ ప్రమాదకర సింథటిక్ కలర్స్ కలుపుతున్నారని ఈ టెస్టుల్లో తేలింది. తనిఖీల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 79 చోట్ల నుంచి ఫుడ్ శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి 49 శాంపిల్స్ తీసుకున్నారు. దీంతో ఒక్క బెంగళూరు సిటీలోనే 19 శాంపిల్స్ లో కేన్సర్ కారకాలు ఉన్నట్టు నిర్ధారణ అయింది. 

ఆర్టిఫిషియల్ కలర్స్ పై నిషేధం.. 

ప్రధానంగా పానీ పూరీ సాస్, స్వీట్ చిల్లీ పౌడర్లలో కేన్సర్ కారకాలు అత్యధికంగా ఉన్నట్టు పరీక్షల్లో వెల్లడైంది. సన్ సెట్ యెల్లో, బ్రిలియంట్ బ్లూ, కార్మోయిసిన్ వంటి హానికర రంగులను గప్ చుప్ ల వెండర్లు వాడుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో కర్నాటకలో పానీ పూరీ సాస్, స్వీట్ చిల్లీ పౌడర్ల తయారీలో సింథటిక్ కలర్స్ వాడకాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. అన్ని రకాల కబాబ్ లతో సహా వివిధ వంటకాల్లో ఆర్టిఫిషియల్ కలర్స్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ వాడరాదంటూ కర్నాటక హెల్త్ డిపార్ట్ మెంట్ ఇటీవల ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అనేక చోట్ల తనిఖీలు చేపడుతున్నారు. కాగా, ఫుడ్స్ లో అతి సాధారణంగా వాడే రోడమైన్ బీ అనే కలర్ ఏజెంట్ ను నిషేధిస్తున్నట్టు కర్నాటక ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో ప్రకటించింది. బెంగళూరులో గోబీ మంచూరియాను అమ్మే వెండర్లు రోడమైన్ బీ కృత్రిమ రంగుకు బదులుగా నేచురల్ కలర్స్ వాడకాన్ని మొదలుపెట్టారు. దీంతో సిటీలో గోబీ మంచూరియా అమ్మకాలు ఏకంగా 80 శాతం వరకూ పడిపోయాయని చెప్తున్నారు.