40 హోటళ్లపై కేసులు..హైదరాబాద్​లో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ వింగ్ దాడులు 

40 హోటళ్లపై కేసులు..హైదరాబాద్​లో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ వింగ్ దాడులు 
  • జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి తనిఖీలు 
  • గత నెల 16 నుంచి 90 చోట్ల రెయిడ్స్ 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు కలిసి హోటళ్లు, రెస్టారెంట్లు, బార్​లు, పబ్​లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో దిమ్మతిరిగే విషయాలు బయటకు వస్తున్నాయి. పేరొందిన హోటల్స్, రెస్టారెంట్లు మొదలు బార్​లు, పబ్​ల వరకు నాణ్యత లేని ఆహారం వండి వడ్డిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. కిచెన్ లు అపరిశుభ్రంగా ఉండడం, పురుగుబట్టిన, పాడైపోయిన, కాలం చెల్లిన వస్తువులు, రెండు మూడ్రోజులు నిల్వ ఉంచిన చికెన్ ను వినియోగిస్తున్నట్టు గుర్తించారు. 

గత నెల 16 నుంచి ఇప్పటి వరకు 90 చోట్ల అధికారులు తనిఖీలు చేయగా, వాటిల్లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని 40 హోటళ్లపై కేసులు నమోదు చేశారు. తాజాగా మంగళవారం సోమాజిగూడలోని కృతుంగా రెస్టారెంట్, హెడ్ క్వార్టర్స్ రెస్ట్ ఓ బార్, కేఎఫ్ సీల్లో తనిఖీలు నిర్వహించారు. కృతుంగాలో నాణ్యత లేని 6 కిలోల పన్నీర్, కాలం చెల్లిన 6 కిలోల మేతి మలై పేస్ట్, టీడీఎస్ 4 పీపీఎం ఉన్న 156 వాటర్ బాటిల్స్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. హెడ్ క్వార్టర్స్ రెస్ట్ ఓ బార్ లో ఎలాంటి లేబుల్స్ లేని వస్తువులను, సింథటిక్ కలర్లను వాడుతున్నట్టు గుర్తించారు. కేఎఫ్ సీలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ డిస్ ప్లే చేయడం లేదని గుర్తించారు.  

నగరంలో ఎక్కడ చూసినా అంతే.. 

నగరంలోని చాలా హోటళ్లలో నాణ్యత లేని ఆహారమే వడ్డిస్తున్నారు. ఇటీవల మకావు కిచెన్ అండ్ బార్‌‌‌‌‌‌‌‌లో అధికారులు తనిఖీలు నిర్వహించగా ఫుడ్ పై ఫంగస్, బొద్దింకలు ఉన్నట్టు గుర్తించారు. రూ.4,970 విలువైన స్నేహ చికెన్, బుల్ డాగ్ సాస్, మాలాస్ ఆరెంజ్ మార్మాలాడ్, టిపరోస్ ఫిష్ సాస్, మయోనైస్ తో పాటు ఫంగస్ సోకిన జీడిపప్పు స్వాధీనం చేసుకున్నారు. అలాగే హిమాయత్ నగర్ లోని క్లోవ్ వెజిటేరియన్ ఫైన్ డైన్ ది ప్లాటినం హోటల్స్ లో చీజ్, ఖట్టా సిరప్, ఏటీసీ మసాలాలు, శాండ్​విచ్ బ్రెడ్‌‌‌‌‌‌‌‌లు, బ్రౌన్ షుగర్ తదితర వస్తువుల గడువు ముగిసినట్టు గుర్తించారు.

ఐస్ క్రీమ్ నిల్వ యూనిట్‌‌‌‌‌‌‌‌లో బొద్దింకలను గమనించారు. పాడైపోయిన క్యారెట్‌‌‌‌‌‌‌‌లు, వండిన వెజిటబుల్ బిర్యానీ ఫ్రిజ్‌‌‌‌‌‌‌‌లో నిల్వ ఉన్నట్లు, లేబుల్ లేని 35 కిలోల శనగ పప్పు గుర్తించారు. వాటి నాణ్యతను పరిశీలించేందుకు శాంపిల్స్ సేకరించారు. అదే విధంగా క్రీమ్ స్టోన్ లోనూ స్ట్రాబెర్రీ పేస్ట్  గడువు ముగిసిన స్టాక్ ఉన్నట్టు గుర్తించారు. గోకుల్ చాట్, పిస్తా హౌస్ లలోనూ ఫుడ్ తయారీ విషయంలో మేనేజ్ మెంట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు. 

కేసులు నమోదు చేస్తున్నం.. 

స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్​తో కలిసి హైదరాబాద్​లో తనిఖీలు నిర్వహిస్తున్నం. కల్తీ ఆహారం సప్లయ్ చేస్తున్న వారిపై కేసులు పెడుతున్నం. రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా కూడా విధిస్తున్నం. లీగల్​గా వెళ్లేందుకు అడిషనల్ కలెక్టర్లకు ఫైల్ పంపుతాం. అన్ సేఫ్ ఫుడ్ అని తేలితే కోర్టు ద్వారా 3 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఫుడ్ క్వాలిటీపై తెలంగాణ వ్యాప్తంగా అయితే diripmtg@gmail.com లేదా fssmutg@gmail.com కి మెయిల్ ద్వారా గానీ  91001 05795 నంబర్ కి కాల్ చేసి గానీ ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ట్విట్టర్ (ఎక్స్) ద్వారా అయితే @cfs_telanganaకు కంప్లయింట్​ చేయవచ్చు. అదే జీహెచ్ఎంసీ పరిధిలో అయితే 040–21111111 నంబర్ కు లేదా foodsafetywing.ghmc@gmail.comకు మెయిల్ ద్వారా, ట్విట్టర్ అయితే @afcghmc కి ఫిర్యాదు చేయవచ్చు. 
- బాలాజీ, అసిస్టెంట్ 
ఫుడ్ కంట్రోలర్, జీహెచ్ఎంసీ