వాష్ రూంలోనే క్రీడాకారులకు భోజనం వడ్డించిన సిబ్బంది

 వాష్ రూంలోనే క్రీడాకారులకు భోజనం వడ్డించిన సిబ్బంది

ఉత్తరప్రదేశ్ లో కబడ్డీ ఆటగాళ్లకు బాత్ రూంలో ఆహారం అందిస్తున్నట్టు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలను సెప్టెంబర్ 16న సహరాన్‌పూర్‌లో అండర్-17 రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ కి చెందిన కొందరు క్రీడాకారులు చిత్రీకరించినట్లు సమాచారం. అయితే ఈ వీడియోలలో బాత్ రూంలోనే అన్నం, ఇతర కూరగాయలున్నాయి. అక్కడికి క్రీడాకారులొచ్చి తమ ప్లేట్లల్లో అన్నం వడ్డించుకొని వెళ్తున్నారు. 

ఇదే వీడియోలో ఆ క్రీడాకారులు వచ్చిన రూంలోనే వాష్ బేసిన్ లు, యూరినల్స్ ఉండడం అక్కడి సౌకర్యాల లేమికి, అధికారుల నిర్లక్ష్యానికి ప్రతీకగా నిలుస్తోంది. అదే టాయిలెట్ ఫ్లోర్ లోనే రైస్ వడ్డించే పాత్రలుండడం అక్కడి దుస్థితిని తేటతెల్లం చేస్తోంది. అయితే ఈ ఘటనపై స్పందించిన సహరాన్‌పూర్ స్పోర్ట్స్ ఆఫీసర్ అనిమేష్ సక్సేనా... ఈ వాదనలను తోసిపుచ్చారు. కొన్ని అనివార్య కారణాల కారణంగా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆహారాన్ని వండారని, అందుకే గది మార్చారని చెప్పారు. వీడియోలో చూపినట్టు బాత్‌రూమ్‌లో అన్నం పెట్టలేదని, వర్షం కురుస్తున్నందున స్విమ్మింగ్ పూల్ ప్రాంతంలో భోజన ఏర్పాట్లు చేసామన్నారు. స్విమ్మింగ్ పూల్ పక్కనే దుస్తులు మార్చుకునే గదిలో ఉంచామని స్పష్టం చేశారు. స్టేడియం నిర్మాణ పనులు జరుగుతున్నాయి.. అందులోనూ వర్షం కురుస్తుండడం వల్ల ఆహారాన్ని ఉంచడానికి మరొక ప్రదేశం లేక అలా చేశామని సక్సేనా తెలిపారు.