
ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత మేటి ఆటగాళ్లలో ఒకడైన పీలే కన్నుమూశాడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పీలే.. గురువారం సావోపాలోలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. బ్రెజిల్‌కు చెందిన పీలే వయసు 82 ఏళ్లు. గత ఏడాది కాలం నుంచి క్యాన్సర్ తో బాధపడుతున్న పీలే... ఇన్నిరోజులూ చికిత్స తీసుకుంటూ కాలం నెట్టుకొచ్చాడు.
ఇంతలోనే ఆరోగ్యం విషమించి వివిధ అవయవాలు పని చేయడం మానేశాయి. కొన్ని రోజుల పాటు మృత్యువుతో పోరాడిన పీలే.. గురువారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచాడు. ఫుట్‌బాల్‌లో మూడు ప్రపంచకప్ విజయాల్లో భాగస్వామి అయిన ఏకైక ఆటగాడు పీలేనే. మంత్రముగ్ధమైన తన ఆటతో రెండు దశాబ్దాల పాటు పీలే సాకర్ ప్రేమికులను ఉర్రూతలూగించాడు. తన తరంలోనే కాక మొత్తంగా ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు.