
- పదేండ్లలో దేశానికి 60 బిలియన్ డాలర్లు ఆర్జించింది
- 47 లక్షల ఉద్యోగాల కల్పన
- నోవాస్పేస్ రిపోర్టులో వెల్లడి
న్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాలతో మన దేశ సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటుతున్న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో).. ఆర్థికంగానూ మన దేశానికి అండగా నిలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం దానిపై పెడుతున్న పెట్టుబడికి లాభాలు తెచ్చిపెడుతున్నది. ఫ్రాన్స్‌కు చెందిన స్పేస్ కన్సల్టింగ్ సంస్థ నోవాస్పేస్ తయారు చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
మన దేశంలో ఇస్రో ఆర్థిక, సామాజిక ప్రభావంపై నోవాస్పేస్ స్టడీ చేసింది. ఈ స్టడీని ఇస్రోనే చేయించింది. శుక్రవారం నేషనల్ స్పేస్ డే సందర్భంగా రిపోర్టును విడుదల చేశారు. ఇస్రో గత పదేండ్లలో దేశ ఆర్థిక వ్యవస్థకు 60 బిలియన్ డాలర్లు సమకూర్చిందని, 47 లక్షల ఉద్యోగాలు కల్పించిందని నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా 24 బిలియన్ డాలర్ల ట్యాక్స్ రెవెన్యూ తీసుకొచ్చినట్టు పేర్కొంది. రానున్న పదేండ్లలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఇస్రో 89 బిలియన్ డాలర్ల నుంచి 131 బిలియన్ డాలర్ల వరకు సమకూర్చనుందని తెలిపింది. కాగా, దేశంలోని ప్రతి ఒక్కరి జీవితంలో ఇస్రో భాగమైందని చైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. ‘‘ఇస్రోపై పెడుతున్న ప్రతి రూపాయికి 2.5 రెట్లు లాభం వస్తున్నది. ఇస్రోతో ఆర్థికంగా, సామాజికంగా దేశానికి ఎంతో ప్రయోజనం
చేకూరుతున్నది” అని ఆయన పేర్కొన్నారు.
127 ఉపగ్రహాల ప్రయోగం..
ప్రజలకు ఇస్రో ఎన్నోరకాలుగా సేవలందిస్తున్నదని నివేదికలో నోవాస్పేస్ వెల్లడించింది. ఉపగ్రహ ఆధారిత అప్లికేషన్లు భారతీయుల రోజువారీ జీవితంలో భాగమయ్యాయని పేర్కొంది. ‘‘ఇస్రో ప్రతిరోజూ 8 లక్షల మంది మత్స్యకారులతో పాటు దేశ ప్రజలందరికీ వాతావరణ సమాచారం తెలియజేస్తోంది. స్పై శాటిలైట్స్‌తో సెక్యూరిటీ సేవలందిస్తున్నది. శాటిలైట్ ద్వారా ఏటీఎం మెషిన్లకు అవసరమైన సేవలు కూడా అందిస్తున్నది” అని తెలిపింది. ‘‘ఇస్రో 2023 డిసెంబర్ 31 నాటికి 127 స్వదేశీ ఉపగ్రహాలను, మరో 432 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. ఉపగ్రహా ప్రయోగాలకు ఇస్రో వద్ద 3 కమర్షియల్ రాకెట్స్ ఉన్నాయి” అని వెల్లడించింది. ‘‘ఇస్రో చంద్రయాన్ 3 మిషన్ ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకుని చరిత్ర సృష్టించింది. ఈ ప్రయోగాన్ని యూట్యూబ్‌లో 8 కోట్ల మంది చూశారు” అని తెలిపింది.