ఒక్కో ఫ్యామిలీకి లక్షన్నర లాస్

ఒక్కో ఫ్యామిలీకి లక్షన్నర లాస్
  • టీవీ, ఫ్రిజ్​, వాషింగ్​మెషిన్​ వంటి వస్తువులకే రూ.లక్ష నష్టం
  • వెహికల్స్​, ఇతర సామాన్లు కలిపితే మరో 50 వేలు

హైదరాబాద్‌‌, వెలుగు: కుండపోత వానలు, వరద, ముంపుతో గ్రేటర్​ హైదరాబాద్​ జనం అంతులేని కష్టాల్లో పడ్డరు. నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్​ పరికరాలు, వెహికల్స్, ఇతర సామాను అంతా పాడైపోయి కండ్ల నీళ్లు పెట్టుకుంటున్నరు. ఒకటీ రెండు కాదు హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో కలిపి పది లక్షల కుటుంబాలకుపైనే వానలతో ఎఫెక్ట్​ పడింది. ఒక్కో ఫ్యామిలీ రూ.లక్ష నుంచి లక్షన్నర దాకా లాస్​ అయింది. మొత్తంగా బాధితులకు పదిహేను వేల కోట్ల రూపాయలకుపైనే నష్టం జరిగింది. ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నీళ్లే కనిపిస్తున్నాయి. ఎప్పటికి కోలుకుంటామనే ఆవేదన వ్యక్తమవుతోంది. మరోవైపు ఇంకా వందల కాలనీలు ముంపులోనే ఉన్నాయి. చాలాచోట్ల సాయం కోసం జనం ఎదురుచూస్తున్నారు. తమను ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు.

సర్వం నష్టమే..

గ్రేటర్‌‌ హైదరాబాద్, శివార్లలో కలిపి 10 లక్షలకుపైగా కుటుంబాలు వరద, ముంపుతో నష్టపోయాయి. బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసరాలు తడిసిపోయాయి. ఇలా పాడైన నిత్యావసరాల విలువే రూ.15 వందల కోట్లకుపైగా ఉంటుందని అంచనా. ఇక ఇంట్లో ఉన్న ఫ్రిజ్‌‌, టీవీ, గ్రైండర్‌‌, వాషింగ్‌‌ మెషీన్‌‌, కూలర్‌‌, కంప్యూటర్లు, కార్లు, బైకులు సర్వం డ్యామేజీ అయ్యాయి. దెబ్బతిన్న వెహికల్స్​సంఖ్యనే ఎనిమిది లక్షలకుపైగా ఉంటుంది. సగటున ప్రతి ఇంటికి లక్షన్నర దాకా నష్టం జరిగింది. పెద్ద కాలనీల్లో ఈ నష్టం మరింత ఎక్కువగా ఉందని చెప్తున్నారు.

కుండపోత వానతో..

హైదరాబాద్ సిటీ, శివారు ప్రాంతాల్లో ఈ నెల 13న రికార్డు స్థాయిలో కుండపోత వర్షం కురిసింది. ఈ దెబ్బకు చెరువులు, కుంటలు నిండి.. నాలాలు పొంగాయి. ముసీ వరద పోటెత్తింది. రెండు వేల కాలనీలు, బస్తీలు నీట మునిగాయి. రోడ్లన్నీ చెరువులాల మారాయి. బైకులు, కార్లే కాదు.. పెద్ద వెహికల్స్​ కూడా వరదలో కొట్టుకుపోయాయి. లక్షలాది మంది ఆగమాగమయ్యారు.

అంతా ఆగమాగమే..

హైదరాబాద్​ సిటీ, శివార్లలో కలిపి 3,187 చెరువులు ఉన్నట్లు జీహెచ్‌‌ఎంసీ గతంలోనే గుర్తించింది. ఇందులో కోర్‌‌ సిటీలోనే 180 చెరువులు ఉన్నాయి. ఇవన్నీ గొలుసుకట్టుగా ఉంటాయి. సిటీ నిండా వరద నీటి కాల్వలు, నాలాలు కలిపి రెండున్నర వేల కిలోమీటర్ల పొడవుతో ఉన్నాయి. మొన్నటి వర్షాలకు ఈ చెరువులు, నాలాల్లో వరద పోటెత్తింది. కొన్ని చెరువులకు గండ్లు పడ్డాయి. మరికొన్ని ప్రమాదకరంగా మారాయి. మొత్తం 80కిపైగా చెరువులకు గండ్లు పడ్డాయని, 130 చెరువులు పూర్తిగా నిండాయని జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు.

మంత్రి చెప్పిన లెక్కనే 4 లక్షల ఫ్యామిలీలు..

గ్రేటర్‌‌ హైదరాబాద్​లో సుమారు ఐదువేల కాలనీలు, మూడు వేల బస్తీలున్నాయి. మొన్నటి వానలకు దాదాపు 1,200 కాలనీలు, 800 బస్తీలు పూర్తిగా నీట మునిగాయి. మున్సిపల్‌‌  మంత్రి కేటీఆర్‌‌  రెండు రోజుల క్రితం స్వయంగా చెప్పిన లెక్కల ప్రకారమే.. ముంపుబారిన పడ్డ నాలుగు లక్షల ఫ్యామిలీలకు రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర సర్కారు రూ.550 కోట్లు రిలీజ్‌‌ చేసింది. అంటే పది వేల చొప్పున ఐదున్నర లక్షల కుటుంబాలకు ఈ సొమ్మును అందించవచ్చు. ఇవన్నీ అధికారిక లెక్కలే. కానీ ముంపు బారినపడ్డ కుటుంబాల సంఖ్య ఇంతకు రెండింతలు ఉంటుందని, పది లక్షల ఫ్యామిలీలపై ఎఫెక్ట్​ పడిందని.. సహాయక చర్యల్లో ఉన్న స్వచ్చంద సంస్థలు లెక్క చెప్తున్నాయి.

బతుకుదెరువు పోయింది

అద్దె ఇంట్లో టైలరింగ్​ చేస్తూ బతుకుతున్న. మూడు కుట్టుమిషిన్లలో ఒకటి వరదలోనే కొట్టుకపోయింది. మిగతా రెండు కూడా ఖరాబైనయ్​. కస్టమర్లు ఇచ్చిన బట్టలు కొట్టుకపోయినయి. ఇంట్ల ఫ్రిజ్​, కూలర్, వేరే ఎలక్ట్రానిక్​ వస్తువులు దెబ్బతిన్నయ్​.

– లక్ష్మి, టైలర్

రోజు 10 బైకులు రిపేర్ చేస్తున్న..

నీటిలో మునిగిన బైకులు చాలా వస్తున్నయి. రోజుకు10 బైకులు రిపేర్​ చేస్తున్న. సరిపడా మెకానిక్ లు లేక బైకులు తీసుకోవడం లేదు. చాలా వాటికి రెండు, మూడు వేలకుపైగానే ఖర్చు అవుతోంది. ఇంకొన్నింటికి ఎక్కువ ఖర్చు వస్తోంది.

– గణేశ్​, మెకానిక్

వాహనాల రిపేర్ల ఖర్చులివీ..

  •   25 వేల ఆటోలకు రూ.62 కోట్లు
  •   15 వేల ట్రాలీలకు రూ.45 కోట్లు
  •   2.5 లక్షల కార్లకు రూ.1,250 కోట్లు
  •   5 లక్షల టూవీలర్లకు రూ.150 కోట్లు
  •   మొత్తం ఖర్చు రూ.1,507 కోట్లు

చెరువులు తెగి.. నీళ్లలో మునిగి..

  • షేక్ పేట పరిధిలో ఎంజే కాలనీ, హఫీజ్ బాబా నగర్, ఉమర్ కాలనీ, అంబేద్కర్ నగర్, చాబ్రా ఎన్ క్లేవ్, బాబా ఎన్ క్లేవ్, విరాసత్ కాలనీ, బాల్ రెడ్డి నగర్ ప్రాంతాలు నీట మునిగిపోయి.. స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రాంతాలను ఆనుకుని ఉన్న షంషీర్ చెరువులో చెత్తా చెదారం నిండిపోవడంతో నీళ్లు నిలవక కాలనీల్లోకి వచ్చేశాయి.
  •  పల్లె చెరువు కట్ట తెగి వరద అంతా చాంద్రాయణ్ గుట్ట ప్రాంతాలను ముంచెత్తింది. ఓల్డ్ సిటీలోని బస్తీలు ఇప్పటికీ తేరుకోలేదు. అల్ జుబేల్ కాలనీలో నీళ్లు కొంత తగ్గాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
  • ఎల్బీనగర్ ఏరియాలో కాప్రాయ్​ చెరువు, బాతుల చెరువు, కుమ్మరి కుంట, బండ్లగూడ చెరువు, సరూర్ నగర్ పెద్ద చెరువు, మీర్ పేట చెరువులు పొంగి.. బంజారా కాలనీ, హయత్ నగర్, రంగనాయక కుంట, అంబేద్కర్ కాలనీ, బీజేఆర్ కాలనీ, నాగోల్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, మల్లికార్జున్ నగర్ ఫేజ్ 1, 2, సీసాల బస్తీ, కోదండరాం నగర్, కమలా నగర్, వనస్థలిపురంలోని హరిహర కాలనీ, సాయి నగర్ ప్రాంతాలు ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి.
  • రామంతాపూర్ పెద్ద చెరువు కట్టతెగిపోవడంతో ఇంద్రానగర్, నేతాజీ నగర్, శేఖర్ బస్తీ, భవానీ నగర్, బాలాజీ నగర్, భరత్ నగర్, శాంతినగర్, శ్రీనగర్ కాలనీ, కేసీఆర్ నగర్, కూర్మ నగర్, గ్రీన్ కాలనీతోపాటు హబ్సిగూడలోని సాయిచిత్ర కాలనీ, రవీంద్ర కాలనీల్లోని నివాసమున్న మూడు వేల కుటుంబాలు ముంపుతో బాధపడుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ తాగునీరు, కరెంట్ సరఫరా లేదు. నిత్యావసర సరుకులన్నీ నీళ్లలో మునిగిపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు.