
- షరతులతో పర్మిషన్ ఇచ్చిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: భైంసా పట్టణం, తానూర్ గ్రామంలో శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30న(గురువారం) శ్రీరామ నవమి సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు యాత్రకు పర్మిషన్ఇవ్వాలని ఆదేశించింది. మతపరంగా, రాజకీయంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని షరతు విధించింది. యాత్రలో రాజకీయ నేతలు, నేరచరిత్ర ఉన్నవాళ్లు పాల్గొనరాదని షరతు విధించింది. మసీదులున్న చోట శోభాయాత్ర నిర్వహించేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, మసీదుకు 150 మీటర్ల దూరంలో సౌండ్ సిస్టం ఆపేయాలంది. ఈ మేరకు జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
భైంసాలో శ్రీరామ నవమి శోభాయాత్రకు పర్మిషన్ ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ హిందూ వాహిని పిటిషన్ దాఖలు చేసింది. నిర్మల్ జిల్లా తానూర్ గ్రామంలో శోభాయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అదే గ్రామానికి చెందిన ఏ.నరేందర్, ఆర్.గంగాప్రసాద్ మరో పిటిషన్ దాఖలు చేశారు. వీటిని మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి విచారించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది టి. సూర్యకరణ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ప్రతిసారి శోభాయత్రకు కోర్టు అనుమతి తీసుకుని జరుపుకోవాల్సి వస్తోందన్నారు.
పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ఇదిసరికాదని, మెజార్టీ ప్రజలు పండుగ చేసుకునేందుకు శోభాయాత్ర నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు. గతేడాది యాత్ర సందర్భంగా వివాదం చోటు చేసుకుందని ప్రభుత్వ ప్లీడర్ సామల రవీందర్ గుర్తు చేశారు. హిందువులు అనుమతి తీసుకుని పండుగలు జరుపుకోవాల్సి వస్తుందనే వాదన సరికాదన్నారు. ప్రభుత్వం ఏ మతాన్ని తక్కువ చేసి చూడటం లేదని, భైంసా పట్టణంలోనే ఏడు ఆలయాల్లో శ్రీరామనవమి నిర్వహించేందుకు పోలీసులు అనుమతులు ఇచ్చారని తెలిపారు.
హిందూ వాహిని జరిపే శోభాయాత్రలో రాజకీయ నాయకులు విద్వేషపూరిత ప్రసంగాలు చేసే అవకాశం ఉందని, రంజాన్ మాసం కావడం వల్ల ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. అనుమతి ఇచ్చినా ఆంక్షలు విధించాలని కోరారు. వాదనల తర్వాత హైకోర్టు షరతులతో శోభాయాత్రకు అనుమతి ఇచ్చింది.