ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్‌.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఏఐ.. అల్బేనియా కేబినెట్‌‌లో ఏఐ మినిస్టర్!

 ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్‌.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఏఐ.. అల్బేనియా కేబినెట్‌‌లో ఏఐ మినిస్టర్!
  • ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్‌‌ వర్చువల్ మంత్రి.. పేరు డియెల్లా  
  • అవినీతి కట్టడి కోసమేనని ప్రధాని ఏడీ రామా వెల్లడి 

టిరానా: ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కాలం నడుస్తున్నది. ఇది ఒక్కో రంగంలోకి అడుగుపెడుతూ వస్తున్నది. ఇప్పుడు రాజకీయ రంగంలోకీ ఎంట్రీ ఇచ్చింది. అల్బేనియా ఏకంగా తమ ప్రభుత్వంలో ఏఐ మినిస్టర్‌‌‌‌ను నియమించింది. ఇలా ఒక వర్చువల్ మినిస్టర్‌‌‌‌ను నియమించడం ప్రపంచంలోనే మొదటిసారి. 

ఈ ఏఐ మహిళా మంత్రిని కేబినెట్ మీటింగ్‌‌లో అల్బేనియా ప్రధాని ఏడీ రామా పరిచయం చేశారు. ఈమెకు డియెల్లా అని పేరు పెట్టారు. అంటే అల్బేనియన్ భాషలో సూర్యుడు అని అర్థం. డియెల్లా అల్బేనియన్ సంప్రదాయ దుస్తులు ధరించి అందంగా కనిపిస్తున్నది. 

డియెల్లా.. ఏం చేస్తుంది? 

అల్బేనియాలో పబ్లిక్ ప్రొక్యూర్‌‌‌‌మెంట్ విభాగంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నదని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ విభాగంలో అవినీతిని అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏఐ మినిస్టర్‌‌‌‌ను నియమించింది. ఇకపై ఈ డిపార్ట్‌‌మెంట్ బాధ్యతలన్నీ డియెల్లానే చూసుకుంటుంది. ‘‘డియెల్లా.. ఏఐ ఆధారంగా రూపొందించిన వర్చువల్ మంత్రి. ఈమె పబ్లిక్ ప్రొక్యూర్‌‌మెంట్‌‌ విధానాల్లో సమూల మార్పులు తీసుకొస్తుంది. ఎలాంటి అవినీతి లేకుండా ప్రభుత్వ టెండర్లను పర్యవేక్షిస్తుంది. పక్షపాతం లేకుండా టెండర్లను పరిశీలిస్తుంది. పారదర్శకంగా పబ్లిక్ ఫండ్ కేటాయింపులు జరుపుతుంది” అని ప్రధాని ఏడీ రామా తెలిపారు. 

ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసేలా, పాలనా వ్యవస్థపై నమ్మకం పెరిగేలా దశలవారీగా ఇలాంటి సంస్కరణలు తీసుకొస్తామని చెప్పారు. ఏఐ ద్వారా అవినీతిపై జరిపే పోరాటంలో ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తామన్నారు. ఈ ఏఐ మంత్రి నిర్ణయాలు ఎలా ఉంటాయి? ఏదైనా నష్టం జరిగితే పరిస్థితేంటి? దీనిని ఎవరైనా ఏమార్చితే ఎలా? అనే వాటికి ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. డియెల్లాను ఈ ఏడాది జనవరిలోనే లాంచ్ చేశారు.  ఏఐ వర్చువల్ అసిస్టెంట్‌‌గా సేవలందించింది. 36,600 డాక్యుమెంట్లను ఇష్యూ చేయడంలో సాయమందించింది. దాదాపు వెయ్యి సర్వీసులను అందించింది.