మొదటిసారి దసరా వేడుకల్లో మహిళకు RSS ఆహ్వానం

మొదటిసారి దసరా వేడుకల్లో మహిళకు RSS ఆహ్వానం

నాగ్‌పూర్‌ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మొదటిసారిగా దసరా వేడుకలకు ముఖ్య అతిథిగా ఓ మహిళను ఆహ్వానించింది. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆధ్వర్యంలో నాగ్‌పూర్‌లో నిర్వహించిన విజయదశమి వేడుక ఇందుకు వేదికైంది. ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన తొలి మహిళగా  సంతోష్ యాదవ్ ప్రపంచ రికార్డు సృష్టించారు. 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం సంతోష్‌ యాదవ్‌ను పద్మ శ్రీ పురస్కారంతో గౌరవించింది.

అన్ని ప్రదేశాలలో మహిళలకు సమాన హక్కులు కల్పించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్‌ మోహన్ భగవత్ సూచించారు. ‘స్త్రీని తల్లిగా భావించడం మంచిది. కానీ, తలుపులు బంధించి వాళ్లను పరిమితం చేయడం మంచిది కాదు. అన్ని చోట్లా నిర్ణయాలు తీసుకునేలా మహిళలకు సమాన హక్కులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక మగవాడు చేయలేని పనులను చేయగలిగే సామర్థ్యం స్త్రీ శక్తికి ఉంది.  అందువల్ల వాళ్లకు సాధికారత కల్పించడం, పని చేసే స్వేచ్ఛను ఇవ్వడం, పనిలో సమాన భాగస్వామ్యం ఇవ్వడం చాలా అవసరం’ అని అన్నారు. 

ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో మహిళలకు ప్రాధాన్యం లేకపోవడంపై ఓ సమావేశంలో సీనియర్‌ కార్యకర్త అయిన దత్తాత్రేయ హోసబలే అసంతృప్తి వ్యక్తం చేశారని, ఆర్ఎస్ఎస్ అంటే మగవాళ్లకు మాత్రమేననే ముద్ర చెరిపేయాలని ఆయన కోరారట. ఈ క్రమంలోనే  ఆయన దత్తాత్రేయ హోసబలే సలహాను పరిగణలోకి తీసుకుని..సంతోష్‌ యాదవ్‌ను దసరా వేడుకలకు ఆహ్వానించారని తెలుస్తోంది. 

హర్యానాలోని రేవారీ జిల్లాలోని ఓ కుగ్రామంలో సంతోష్ యాదవ్ జన్మించారు. ఎవరెస్ట్‌ పర్వతాన్ని రెండుసార్లు (1992, 1993లో) అధిరోహించిన తొలి మహిళగా సంతోష్ యాదవ్ పేరిట రికార్డు ఉంది. ఆరుగురు తోబుట్టువుల్లో సంతోష్ యాదవ్ ఒక్కరే అమ్మాయి కావడంతో ఆమె పోరాటం ప్రత్యేకంగా నిలిచింది.డిగ్రీ చదివే రోజుల్లో తన హాస్టల్‌ రూం నుంచి ఆరావళి పర్వతాలను అధిరోహిస్తున్న పర్వతారోహకులను చూసి సంతోష్ యాదవ్ స్ఫూర్తి పొందారని చెబుతుంటారు. 1992లో తన తోటి పర్వతారోహకుడైన మోహన్ సింగ్‌తో ఆక్సిజన్‌ను పంచుకోవడం ద్వారా ఆమె ఆయన ప్రాణాలను కాపాడగలిగారు. మొదటిసారి ఎవరెస్ట్‌ను అధిరోహించే నాటికి సంతోష్ యాదవ్ వయసు 20 సంవత్సరాలు. 2013లో మాలవత్‌ పూర్ణ పదమూడేళ్ల వయసులో ఎవరెస్ట్‌ను అధిరోహించే వరకు ఆ రికార్డు సంతోష్‌ యాదవ్‌ పేరిట పదిలంగా ఉండిపోయింది.