ఆర్టీసీలో మహిళా ఉద్యోగులకు మళ్లీ నైట్​ డ్యూటీలు

ఆర్టీసీలో మహిళా ఉద్యోగులకు మళ్లీ నైట్​ డ్యూటీలు
  • సీఎం చెప్పినా.. స్పెషల్​ డ్యూటీలు..సౌకర్యాలు పత్తాలేవ్
  • రాత్రి 8 గంటల్లోపు పని పూర్తి కావట్లే

ఖమ్మం, వెలుగు: ఆర్టీసీ మహిళా ఉద్యోగులు కూడా మన అక్కాచెల్లెళ్లలాంటి వాళ్లే. అలాంటి వారి భద్రత కూడా ముఖ్యమే. రాత్రి 8 గంటల్లోపు వాళ్లు డ్యూటీలు ముగించుకొని ఇంటికి చేరాలె. – 20 నెలల క్రితం ఆర్టీసీ కార్మికులతో మీటింగ్ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాటలివి. 
ప్రగతిభవన్ లో ఒక పూటంతా ఆర్టీసీ కార్మికులతో సమావేశమై, వాళ్ల సమస్యలు తెలుసుకొని భోజనం పెట్టి మరీ సీఎం చెప్పిన ఓదార్పు మాటలతో ఆర్టీసీ మహిళా కార్మికులు చాలా సంతోషించారు. అయితే ఈ ఆనందం మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. మీటింగ్ తర్వాత మూడు నాలుగు నెలల పాటు ఆఫీసర్లు మహిళా కండక్టర్లకు స్పెషల్ డ్యూటీలు వేశారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి మొదలై రాత్రి 8 గంటల్లోపు వాళ్ల డ్యూటీ ముగిసి ఇంటికి చేరేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ రెగ్యులర్ డ్యూటీలు రొటీన్ అయ్యాయని మహిళా కండక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం డ్యూటీ ముగిసేందుకు కొన్నిసార్లు రాత్రి 10 గంటలు దాటుతోందని అంటున్నారు. 
బస్టాండ్లలో సౌకర్యాల్లేవ్​
అదే మీటింగ్ లో సీఎం కేసీఆర్ చెప్పిన మరోమాట కూడా అమలు కావడం లేదని ఆర్టీసీ మహిళా ఉద్యోగులు చెబుతున్నారు. మహిళల కోసం బస్టాండ్లలో ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీ అలాగే మిగిలిపోయిందని మహిళా కండక్టర్లు చెబుతున్నారు. ఇటీవల ఖమ్మం నగరంలో దాదాపు రూ.25 కోట్లతో కొత్తగా నిర్మించిన ఆధునిక బస్టాండ్ లో కనీసం మహిళలకు ప్రత్యేక రెస్ట్ రూమ్ లు కూడా లేవని వాపోతున్నారు. ఖమ్మం డిపోలో 100 మంది వరకు మహిళా కండక్టర్లుండగా, రీజియన్ పరిధిలో సుమారు 300 మంది వరకు మహిళా ఉద్యోగులున్నారు. వారిలో చాలామంది రెగ్యులర్ గా డ్యూటీలో భాగంగా ఖమ్మం బస్టాండ్​కు వచ్చి వెళ్తుంటారని, అలాంటి వారికి నెలసరి సమయంలో ప్రత్యేక రెస్ట్ రూమ్ లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందని అంటున్నారు. దీనిపై అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెబుతున్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. 

ఖమ్మం డిపోలో పని చేస్తున్న మహిళా కండక్టర్ లావణ్యకు(పేరు మార్చాం) ఇటీవల రెగ్యులర్ గా సిటీ బస్సులో డ్యూటీ వేస్తున్నారు. డే అవుట్ కింద రోజులో 8 గంటలు డ్యూటీ చేసి, రోజుకు 180 కిలోమీటర్లు టార్గెట్ రీచ్ కావాల్సి ఉంటుంది. అయితే మధ్యాహ్నం కొన్ని సందర్భాల్లో ప్యాసింజర్స్​ లేక కొన్ని స్టాపుల్లో ఎక్కువ సేపు బస్ ఆపాల్సి వస్తోంది. దీని వల్ల 8 గంటల్లో పూర్తి కావాల్సిన డ్యూటీ కాస్తా 12 గంటలు అవుతోంది. దీంతో ఒక్కోసారి డ్యూటీ దిగడానికి రాత్రి 10 గంటలు దాటుతోంది. ఇక 12 గంటలు డ్యూటీ చేసినా, తెల్లారి మళ్లీ ఉదయాన్నే డ్యూటీకి రావాల్సి వస్తోంది. మరికొన్ని సందర్భాల్లో కిలోమీటర్లు పూర్తి కాకపోతే సిటీ బస్సునే ఇతర ఊర్లకు కూడా తిప్పిస్తున్నారు. మరోవైపు బస్టాండ్లలో మహిళా సిబ్బంది కోసం ఎలాంటి స్పెషల్ రెస్ట్ రూమ్స్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇక పాత బస్టాండ్ లో ఆర్టీసీ ఆస్పత్రి ఉండగా, ఇప్పటికీ దాన్ని ఖమ్మం కొత్త బస్టాండ్ కు మార్చకపోవడం వల్ల కూడా సమస్యలు ఎదురవుతున్నాయి.
8 గంటల్లోపు డ్యూటీ దిగేలా చూస్తున్నం
మహిళా కండక్టర్లకు సీఎం కేసీఆర్ మాట ఇచ్చిన విధంగా సాధ్యమైనంత త్వరగా వాళ్లు డ్యూటీలు ముగించుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. రెగ్యులర్ డ్యూటీలు కాకుండా స్పెషల్ డ్యూటీలు వేసి రాత్రి 8 గంటల్లోపు డ్యూటీ దిగేలా చూస్తున్నం.  కొన్ని సందర్భాల్లో ప్రత్యేక కారణాల వల్ల ఆలస్యమవుతుండవచ్చు. అన్ని డిపోల్లో మహిళలకు ప్రత్యేక రెస్ట్ రూమ్ లు ఏర్పాటు చేశాం. బస్టాండ్ లలో మాత్రం ప్రత్యేక రెస్ట్ రూమ్ ల కాన్సెప్ట్ రాష్ట్రం మొత్తంలో ఎక్కడా లేదు.                                                                                  – సాలోమన్, ఖమ్మం రీజనల్ మేనేజర్