రియల్టీలోకి మస్తు ఫారిన్ పైసలు

రియల్టీలోకి మస్తు ఫారిన్ పైసలు
  • గ్రోత్​కు అవకాశాలు ఉండటమే కారణం
  • ఆఫీస్​ప్రాపర్టీలపై ఎక్కువ ఇంట్రెస్ట్​

న్యూఢిల్లీ: భారతదేశం రియల్ ఎస్టేట్‌‌‌‌లోకి ఫారిన్​ నుంచి దండిగా డబ్బులు వస్తున్నాయి. ఈ సెక్టార్​కు వచ్చిన క్యూములేటివ్​ ఇన్​స్టిట్యూషనల్​ ఇన్​ఫ్లో విలువ 26.6 బిలియన్ డాలర్లకు చేరింది. 2017 నుండి 2022 మధ్య ఈ పెట్టుబడులు మూడు రెట్లు పెరిగాయి. కోలియర్స్​ ఇండియా హై ఆన్​ ఇన్వెస్టర్స్​ ఎజెండా రిపోర్ట్​ ప్రకారం, ఇండియాలో రియల్టీ బిజినెస్​లో అనేక సానుకూల మార్పులు వచ్చాయి. కేంద్రం తెచ్చిన కొత్త విధానాల కారణంగా పారదర్శకత పెరిగింది. వ్యాపారం చేయడం సులువుగా మారడం, గ్రోత్​కు చాలా అవకాశాలు ఉండటంతో భారతదేశంలోకి విదేశీ ఇన్వెస్ట్​మెంట్లు గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్నాయి. అంతేగాక బలమైన ఆర్థిక, వ్యాపార ఫండమెంటల్స్ ఇన్​స్టిట్యూషనల్​ పెట్టుబడిదారుల సెంటిమెంట్​ను బలోపేతం చేస్తున్నాయి. వారి పోర్ట్‌‌ఫోలియోలను విస్తరించడానికి ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు.  

2017–22లో ఆఫీస్ సెక్టార్​కు అత్యధికంగా ఇన్వెస్ట్​మెంట్లు వచ్చాయి. మొత్తం విదేశీ ఇన్‌‌ఫ్లోలలో దీని వాటా 45శాతం వరకు ఉంది. పెట్టుబడిదారులు ఆఫీస్​ ప్రాపర్టీల విషయంలో ఉత్సాహంగా ఉన్నప్పటికీ, ప్రత్యామ్నాయ ఆస్తులపైనా వారి ఆసక్తి పెరుగుతోందని కొలియర్స్ ఇండియా ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ సంకీ ప్రసాద్ చెప్పారు. 2017–22లో రియల్ ఎస్టేట్‌‌లో వచ్చిన మొత్తం పెట్టుబడులలో విదేశీ ఇన్వెస్ట్​మెంట్లు 81శాతం  ఉన్నాయి. పెట్టుబడిదారులకు అనుకూలమైన ఎఫ్​డీఐ విధానాలు, ఒప్పందాలు కుదుర్చుకోవడంలో పెరిగిన పారదర్శకత, డైరెక్ట్​ రూట్​ ద్వారా అధిక పెట్టుబడి పరిమితులు భారతదేశ రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్​మెంట్లు పెట్టేలా ఇంటర్నేషనల్​ పెట్టుబడిదారులను ప్రోత్సహించాయి. రియల్టీలో ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్ట్​మెంట్లు 2023 మొదటి క్వార్టర్​లో పుంజుకున్నాయి. ఆఫీస్ సెక్టార్ కేటగిరీ వార్షికంగా 37 శాతం వృద్ధి చెందింది. ఈ విభాగంలోకి 1.7 బిలియన్​ డాలర్ల ఇన్వెస్ట్​మెంట్లు వచ్చాయి.  

భవిష్యత్​ భేష్​..

“భారతదేశ రియల్టీ రాబోయే కొద్ది సంవత్సరాల్లో మరింతగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి.  రియల్ ఎస్టేట్‌‌‌‌లోని అన్ని అసెట్ క్లాస్‌‌లలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే గత కొన్ని సంవత్సరాలుగా ఈ సెక్టార్​కు ఇన్వెస్ట్​మెంట్లు విపరీతంగా పెరుగుతున్నాయి.  తయారీదారులు, కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఇండియావైపు ఆసక్తి చూపిస్తున్నారు ” అని కొలియర్స్ ఇండియాలో క్యాపిటల్ మార్కెట్స్ & ఇన్వెస్ట్‌‌మెంట్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ పీయూష్ గుప్తా అన్నారు. ఇండియా ప్రాపర్టీ మార్కెట్ ప్రస్తుతం ఆకర్షణీయమైన ధరలను, అధిక రాబడులను అందిస్తోందని గ్లోబల్ ఏపీఏసీ (ఆసియా–పసిఫిక్​ రీజియన్​) ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.

ఆసియాలోని ఇతర నగరాలతో పోల్చితే భారతీయ నగరాలు అధిక రాబడిని అందిస్తున్నాయి కాబట్టి మనదేశం ఇన్వెస్టర్లకు ఫేవరెట్​గా మారింది. ఏపీఏసీ ప్రాంతంలో బెంగళూరు, ముంబై వంటి  భారతీయ మెట్రో నగరాలు వరుసగా 2వ, 3వ స్థానాలను ఆక్రమించాయి. ఈ ప్రాంతంలో బెంగళూరులో లీడ్‌‌ఆఫీస్ రాబడులు భారీగా ఉండగా, పారిశ్రామిక ఆస్తుల రాబడిలో ముంబై ముందంజలో ఉంది. ఆర్​బీఐ వడ్డీరేట్ల పెంపును ఆపేయడం వల్ల రియల్టర్లకు మరింత మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడిదారులకు రియల్ ఎస్టేట్ ఆకర్షణీయమైన ఇన్వెస్ట్​మెంట్​గా మారుతుంది.