నవంబర్లో భారీగా పెట్టుబడులను అమ్మిన ఎఫ్‌‌పీఐలు

 నవంబర్లో భారీగా పెట్టుబడులను అమ్మిన ఎఫ్‌‌పీఐలు

న్యూఢిల్లీ: ఫారిన్ పోర్ట్‌‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌పీఐలు) నవంబర్‌‌‌‌లోనూ నికర అమ్మకందారులుగా కొనసాగుతున్నారు. ఈ నెలలోని మొదటి మూడు ట్రేడింగ్ సెషన్లలో నికరంగా రూ.3,400 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. మిడిల్ ఈస్ట్‌‌లో టెన్షన్స్‌‌ కొనసాగుతుండడం, యూఎస్ బాండ్ ఈల్డ్‌‌లు 18 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడంతో ఇండియన్ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఫండ్స్ వెనక్కి తీసేసుకుంటున్నారు.

కిందటి నెలలో నికరంగా రూ.24,548 కోట్ల విలువైన షేర్లను అమ్మిన ఎఫ్‌‌పీఐలు, ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌లో రూ.14,767 కోట్లను వెనక్కి తీసేసుకున్నారు. కానీ,  ఈ ఏడాది మార్చి –  ఆగస్ట్ మధ్య నికరంగా  రూ.1.74 లక్షల కోట్ల విలువైన షేర్లను విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు.  ఎఫ్‌‌పీఐల సెల్లింగ్ ట్రెండ్ కొనసాగకపోవచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. యూఎస్ బాండ్ ఈల్డ్‌‌లు పెరగడం వలనే వీరు నికర అమ్మకందారులుగా మారారని, కానీ ఫెడ్ తాజా పాలసీ మీటింగ్‌‌లో డోవిష్ (వడ్డీ రేట్లను పెంచమనే) సంకేతాలు ఇవ్వడంతో బాండ్‌‌ ఈల్డ్‌‌లు తగ్గుతున్నాయని అన్నారు.

ఇజ్రాయెల్– హమాస్ యుద్ధం మొదలయ్యాక ఎఫ్‌‌పీఐలు నికర అమ్మకందారులుగా మారారు. దీనికి తోడు బాండ్‌‌ ఈల్డ్‌‌లు పెరగడం కూడా ఒక కారణం’ అని మార్నింగ్‌‌స్టార్ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ ఎనలిస్ట్ హిమాన్షు శ్రీవాత్సవ అన్నారు.