భారంగా మారనున్న విదేశీ చదువులు

భారంగా మారనున్న విదేశీ చదువులు
  • జనవరిలో యూఎస్‌‌లో సెమిస్టర్ ఫీజు29.52 లక్షలు.. నేడు31.93 లక్షలు
  • లివింగ్‌‌ కాస్ట్‌‌, ట్రావెల్ ఖర్చులతో కలిపి సెమిస్టర్‌‌‌‌కు అయ్యే ఖర్చు రూ. 41 లక్షలకు
  • విదేశీ చదువుల కోసం పెద్ద మొత్తంలో అప్పులు చేయాల్సిందే

బిజినెస్ డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: 73.80, 76.55, 78.88..తాజాగా 79.99...ఇవి  స్టూడెంట్ల మార్కులు కాదు, డాలర్‌‌‌‌‌‌‌‌ మారకంలో రూపాయి విలువ ఎలా తగ్గిందో తెలియజేసే నెంబర్లు. గత కొన్ని నెలల్లోనే రూపాయి విలువ ఆల్‌‌‌‌టైమ్‌‌‌‌ కనిష్టానికి పడింది. దీంతో  విదేశాల్లో చదువుకోవాలని ప్లాన్స్ వేసుకున్న వాళ్లకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా యూఎస్‌‌‌‌లో చదువుకోవాలని ఇప్పటికే ప్లాన్స్ వేసుకున్న విద్యార్ధులు, అక్కడ పెరిగిన లివింగ్ కాస్ట్‌‌‌‌కు తగ్గట్టు పెద్ద మొత్తంలో లోన్‌‌‌‌ తీసుకోవాల్సి ఉంటుంది.  సమీప భవిష్యత్‌‌‌‌లో  విదేశీ చదువులు మరింత భారమవుతాయని ఎనలిస్టులు చెబుతున్నారు.

‘డాలర్ మారకంలో రూపాయి విలువ కనిష్ట లెవెల్స్‌‌‌‌కు పడిపోవడంతో  విదేశాల్లో చదవాలని ప్లాన్ చేసుకున్న వారు ఆందోళన పడుతున్నారు. రూపాయి పతనంతో వీరిపై అదనంగా ఆర్థిక భారం  పడుతుంది’ అని యూఎస్‌‌‌‌లో లా చేయాలని ప్లాన్ చేసుకున్న స్టూడెంట్‌‌‌‌ ఒకరు పేర్కొన్నారు. ఇతర దేశాలకు మారడం కూడా అంత ఈజీ కాదని, లా వంటి కోర్సులు దేశాల బట్టి వేరు వేరుగా ఉంటాయని అన్నారు.  అధికారిక డేటాప్రకారం, 13.24 లక్షలకు పైగా  స్టూడెంట్లు చదువుల కోసం  విదేశాలకు వెళ్లారు. వీరిలో  యూఎస్‌‌‌‌ఏ (4.65 లక్షల మంది), కెనడా (1.83 లక్షలు), యూఏఈ (1.64 లక్షలు), ఆస్ట్రేలియా (1.09 లక్షలు) దేశాలకు వెళ్లినవారే ఎక్కువ.

 రూపాయి పతనానికి కారణాలు..

1) రష్యా–ఉక్రెయిన్ యుద్ధం స్టార్టయినప్పటి నుంచి  ఇన్వెస్టర్లు డాలర్, గోల్డ్ వంటి సేఫ్ అసెట్స్‌‌ వైపు మరలుతున్నారు. డాలర్‌‌‌‌లు కొనేవారు పెరగడంతో ఈ కరెన్సీ బలపడుతోంది. ఫలితంగా రూపాయి విలువ పడుతోంది. 

2)వడ్డీ రేట్లను యూఎస్ ఫెడ్ వరస పాలసీ మీటింగ్‌‌లలో పెంచుతూ వస్తోంది. యూఎస్ బాండ్‌‌ ఈల్డ్‌‌లు పెరుగుతున్నాయి. ఎక్కువ వడ్డీ ఆదాయం వస్తుండడంతో మన రూపాయిలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు  తమ ఫండ్స్‌‌ను తిరిగి తీసుకొని యూఎస్ మార్కెట్‌‌లో పెట్టడం స్టార్ట్ చేశారు. 

3)గ్లోబల్‌‌గా అప్పులు తీసుకోవడం ఖరీదుగా మారింది.  దీంతో కూడా ఇండియాలోకి వచ్చే డాలర్ల ఇన్‌‌ఫ్లోస్ తగ్గాయి. ఫలితంగా రూపాయి వాల్యూ పడుతోంది. 

రూపాయి విలువ పడుతున్నప్పటికీ, మిగిలిన కరెన్సీలతో పోలిస్తే మన కరెన్సీ  స్టేబుల్‌‌గా ఉందని ఎనలిస్టులు చెబుతున్నారు.  రూపాయి విలువ పతనాన్ని ఆర్‌‌‌‌బీఐ ఆర్టిఫిషియల్‌‌గా ఆపాలని చూస్తోందని, ఈ సెంట్రల్‌‌ బ్యాంక్ జోక్యం లేకపోతే రూపాయి వాల్యూ డాలర్ మారకంలో 85 గా ఉండాలని అంటున్నారు. కాగా, రూపాయి వాల్యూ పడితే దేశంలోని ఎగుమతిదారులు లాభపడతారు. వీరి ప్రొడక్ట్‌‌లు లేదా సర్వీస్‌‌లకు ఎక్కువ రూపాయిలు దక్కుతాయి. అదేవిధంగా దిగుమతులపై చేసే ఖర్చులు కూడా పెరుగుతాయి. ఫలితంగా ఇన్‌‌ఫ్లేషన్ (ధరలు పెరుగుదల) ఎక్కువవుతుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిటీ కూడా 
పెరుగుతుంది.

యూఎస్‌‌‌‌‌‌‌‌ వద్దు..ఇతర దేశాల వైపే

రూపాయి పతనంతో విదేశీ చదువులు ఖరీదుగా మారాయనే విషయం తెలుస్తోందని ఎడ్యుకేషన్‌‌‌‌ లోన్లను ఇచ్చే హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ క్రెడిలా ఎండీ  అర్జిత్‌‌‌‌ సన్యల్‌‌‌‌ అన్నారు. ఖర్చులు పెరగడంతో విద్యార్ధులు పెద్ద మొత్తంలో లోన్లను తీసుకోవాల్సి ఉంటుందని,  ట్యూషన్ ఫీజులు,  సంబంధిత ఖర్చులు పెరిగాయని అన్నారు. ఇప్పటికే లోన్ తీసుకొని, డాలర్లలో సంపాదిస్తున్న వారికి మాత్రం  ప్రస్తుత పరిస్థితులతో లాభం ఉంటుందని పేర్కొన్నారు.  కాగా, డాలర్ మారకంలో రూపాయి విలువ 2017 లో 65 ఉండగా, ప్రస్తుతం 80 కి చేరింది. దీంతో అప్పుడు చెల్లించిన ఫీజులతో పోలిస్తే ఇప్పుడు ఫీజులు భాగా పెరిగాయి. ‘ఈ ఏడాది ప్రారంభంలో రూపాయి విలువ డాలర్ మారకంలో 73.8 ఉన్నప్పుడు ఒక సెమిస్టర్ ఫీజు యూఎస్‌‌‌‌లో సుమారు  రూ. 29.52 లక్షలు (40 వేల డాలర్లు) గా ఉంది.

ప్రస్తుతం  సెమిస్టర్‌‌‌‌‌‌‌‌ ఫీజు రూ. 31.93 లక్షలకు (డాలర్= 79.83 వద్ద)  పెరిగింది. ఒక సెమిస్టర్‌‌‌‌‌‌‌‌ కాలంలో బతకడానికి స్టూడెంట్లకు సగటున రూ. 7.18 లక్షలు (9 వేల డాలర్లు) ఖర్చవుతుంది. ట్రావెల్ ఖర్చులు మరో రూ. 90 నుంచి రూ. లక్ష వరకు ఉంటుంది. మొత్తంగా యూఎస్‌‌‌‌లో చదవాలనుకునే స్టూడెంట్‌‌‌‌  ఒక సెమిస్టర్ కోసం ఏకంగా రూ. 41 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది’ అని క్రెడెన్క్‌‌‌‌ డాట్ కామ్‌‌‌‌ ఫౌండర్‌‌‌‌‌‌‌‌ అవినాష్ కుమార్ వివరించారు.  మరోవైపు విదేశాల్లో చదవాలని నిర్ణయించుకోవడం ఎప్పటి నుంచో ఆలోచించి తీసుకున్న నిర్ణయం అని,  ఇప్పుడు సడెన్‌‌‌‌గా ఈ నిర్ణయాన్ని పేరెంట్స్, స్టూడెంట్స్‌‌‌‌ మార్చుకోలేరని స్టడీ అబ్రాడ్‌‌‌‌ కన్సల్టెంట్స్‌‌‌‌ భావిస్తున్నాయి. స్టూడెంట్లు ఇప్పటికీ విదేశాల్లో చదువుకోవాలని చూస్తున్నారని, కానీ, యూఎస్‌‌‌‌కు బదులు కొంచెం ఖర్చు తక్కువుగా ఉన్న ఫ్రాన్స్, జర్మనీ, పోర్చుగల్‌‌‌‌, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారని గ్లోబల్‌‌‌‌గా స్టూడెంట్లకు అకామిడేషన్స్‌‌‌‌ను అందించే  యూనివర్శిటీ లివింగ్‌‌‌‌ సీఈఓ సౌరభ్‌‌‌‌ అరోరా అన్నారు.