మన షేర్ల కోసం డాలర్లతో వస్తున్నారు

మన షేర్ల కోసం డాలర్లతో వస్తున్నారు

సావరిన్​ ఫండ్స్​కు ఫుల్​ డిమాండ్​!

ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లో, ఎనర్జీ కంపెనీల్లో పెట్టుబడులు

ఇప్పటి వరకు 11 బిలియన్ డాలర్లు వచ్చాయ్​

లండన్ : సావరిన్​ వెల్త్, పెన్షన్ ఫండ్స్‌‌కు భారత్ స్వర్గధామంగా మారింది. పెద్ద పెద్ద సావరిన్​ వెల్త్ ఫండ్స్‌‌ అన్నీ వరుసబెట్టి ఇండియాకు తరలి వస్తున్నాయి. ఎయిర్‌‌‌‌పోర్ట్స్ నుంచి రెన్యూవబుల్ ఎనర్జీ వరకు ప్రతీ కంపెనీల్లో ఈ ఫండ్స్ మెజార్టీ వాటాలను కొనుగోలు చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం రాజకీయ స్థిరత్వం, మధ్య తరగతి ప్రజల ఆదాయం పెరగడం, ఫారినర్స్‌‌ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలే. ఈ సంస్కరణలు వెల్త్, స్టేట్ పెన్షన్ ఫండ్స్ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి దోహదం చేస్తున్నాయి. ఈ ఫండ్స్ ఇప్పుడు ప్రైవేట్ మార్కెట్లలో కూడా తమ వాటాలను విస్తరించుకుంటున్నాయి.

స్టాక్స్, బాండ్స్‌‌పై వీటి ఫోకస్ ఉన్నట్టు తెలుస్తోంది. సావరిన్​ వెల్త్ ఫండ్స్‌‌తో ఇండియా పాపులర్ అయిందని లండన్‌‌కు చెందిన ఓ పార్టనర్ థిహిర్ సర్కార్ చెప్పారు.    మోడీ ప్రభుత్వమే తిరిగి విజయ బావుటా ఎగరవేసి, ఇండియాను మరింత ఆకర్షణీయంగా మార్చిందన్నారు. దీంతో విదేశీ పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 11 బిలియన్ డాలర్ల(రూ.76,474 కోట్లు) ఫారిన్ ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఫ్లోస్‌‌(ఎఫ్‌‌ఐఐలు), ఇండియన్ మార్కెట్‌‌లోకి వచ్చాయి. 2012 నుంచి ఇదే అత్యధికం.  సెన్సెక్స్ కూడా సుమారు 10 శాతం పెరిగింది. పబ్లిక్ మార్కెట్లతో పాటు ప్రైవేట్ మార్కెట్‌‌లో  కూడా  ఫండ్స్  దృష్టిసారించడం ప్రారంభించాయి. ఇండియాలో ప్రైవేట్ ఈక్విటీ డీల్‌‌ యాక్టివిటీ 2018లో 19 బిలియన్ డాలర్లకు(రూ.1,32,142 కోట్లు) పెరిగిందని పిచ్‌‌బుక్ డేటా పేర్కొంది. దీనిలో సావరిన్​ వెల్త్ ఫండ్స్, పెన్షన్ ఫండ్సే రెండు వంతులుగా ఉన్నాయి.

ప్రైవేట్ డీల్స్‌‌లో సింగపూర్‌‌‌‌ జీఐసీ సావరిన్​ వెల్త్ ఫండ్, అబుదాబి ఇన్వెస్ట్‌‌మెంట్ అథారిటీలు రెన్యువబుల్ ఎనర్జీ సంస్థ గ్రీన్‌‌కో ఎనర్జీ హోల్డింగ్స్‌‌లో 495 మిలియన్ డాలర్ల(రూ.3,442 కోట్ల) పెట్టుబడులు పెట్టాయి. గ్రీన్‌‌కో ఎనర్జీ హోల్డింగ్స్ సంస్థ విండ్, సోలార్, హైడ్రో ప్రాజెక్ట్‌‌లపై పనిచేస్తుంది. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఇప్పుడు సోలార్, విండ్ ఎనర్జీ వాడకాన్ని పెంచుతోంది. ఏప్రిల్‌‌లో కూడా ఏడీఐఏ, ఇండియా నేషనల్ ఇన్వెస్ట్‌‌మెంట్ అండ్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్​​ ఫండ్‌‌లు ఇండియన్ దిగ్గజం జీవీకే పవర్ అండ్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్​కు చెందిన ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ యూనిట్‌‌లో 49 శాతం వాటాలను కొనేందుకు అంగీకరించాయి. ఏడీఐఏ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సావరిన్​ వెల్త్ పండ్. ఇది ఇండియన్ ఈక్విటీస్‌‌లో పెట్టుబడులు పెడుతూ.. గత కొన్నేళ్లుగా ఫిక్స్‌‌డ్ ఇన్‌‌కమ్‌‌ను ఆర్జిస్తోంది. ఈ కంపెనీ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, ప్రైవేట్ ఈక్విటీస్‌‌ వంటి అసెట్ క్లాసెస్‌‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తోంది.

కెనడియన్ పెన్షన్ ఫండ్స్ కూడా ఇవే రకమైన డీల్స్‌‌ను ఇండియాతో కుదుర్చుకుంటున్నాయి. ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌‌ 145.8 మిలియన్ డాలర్ల(రూ.1,013 కోట్ల) బయౌట్‌‌లో కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌‌మెంట్ బోర్డు, జీఐసీలు పాల్గొన్నాయి. ఇండియా బలమైన వృద్ధి సాధిస్తుండటం, ఆర్థిక అభివృద్ధి కొనసాగడం వంటివి ఫండ్స్ సంస్థలు మన కంపెనీల్లో మేజర్ వాటాలను పొందడానికి ప్రధాన కారకాలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నాయి. చట్టపరమైన సంస్కరణలు కూడా సెంటిమెంట్‌‌ను మెరుగుపరుస్తున్నాయని చెప్పాయి. ఇక ఇండియాకు ఫారిన్ ఫండ్స్‌‌ రాక పెరుగుతుండటంతో, ఇక్కడే ఫారినర్స్ పోర్ట్‌‌ఫోలియో హోల్డింగ్స్‌‌ను నిర్వహించడానికి ఫండ్స్ మేనేజర్స్‌‌ ఈ ఏడాది నుంచి లైసెన్స్‌‌లు కూడా పొందారు. అంతకు ముందు ఫారినర్స్ పోర్ట్‌‌ఫోలియోలను దేశం వెలుపలే నిర్వహించేవారు.