ధరణి అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి

ధరణి అవకతవకలపై  ఫోరెన్సిక్ ఆడిట్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
  •     రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి
  •     ఇంచు భూమి కూడా అక్రమార్కులకు దక్కనివ్వబోమని వెల్లడి 
  •     ఖమ్మంలో లైసెన్స్ డ్​ సర్వేయర్లకు సర్టిఫికెట్ల అందజేత

ఖమ్మం, వెలుగు: ధరణి వ్యవస్థలో జరిగిన అవకతవకలపై రాష్ట్రవ్యాప్తంగా ఫోరెన్సిక్  ఆడిట్  నిర్వహించనున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థతో సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయిందని, ఆ నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. పేదలకు, ప్రభుత్వానికి చెందిన ఒక్క ఇంచు భూమి కూడా అక్రమార్కులకు దక్కకుండా చర్యలు తీసుకుంటున్నామని  చెప్పారు.

శిక్షణ పూర్తిచేసుకున్న లైసెన్స్ డ్ సర్వేయర్లకు ఆదివారం ఖమ్మం కలెక్టరేట్ లో వైరా ఎమ్మెల్యే రాందాస్​ నాయక్, కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టితో కలిసి మంత్రి పొంగులేటి సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. భూ సమస్యలను పరిష్కరించే అధికారం కలెక్టర్ కు మాత్రమే పరిమితం చేయకుండా డీసెంట్రలైజ్డ్  చేయడం వల్ల చాలా వరకు సమస్యలు వేగంగా పరిష్కారం అవుతున్నాయన్నారు. 

ధరణి లొసుగుల కారణంగా రిజిస్ట్రేషన్ లో రూ.3.90 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్లు గుర్తించామని, దోషులపై కేసు  నమోదు చేసి రికవరీకి  చర్యలు చేపట్టామన్నారు.  ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ధరణి వ్యవస్థను బంగాళాఖాతంలో వేసి భూ భారతి చట్టం తెచ్చామన్నారు. ఆధార్  కార్డు మాదిరిగానే  భూములకు భూధార్  ప్రవేశపెడతామని చెప్పామని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికే  సర్వేయర్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. మండలాల వారీగా భూముల విస్తీర్ణాన్ని బట్టి లైసెన్స్  సర్వేయర్లను అలాట్​ చేస్తామన్నారు. 

సర్వేయర్లకు ఆధునికమైన  రోవర్స్  సామగ్రి పంపిణీ చేస్తున్నామన్నారు. నక్షాలేని 5 గ్రామాల్లో పైలట్  సర్వే  నిర్వహించామని, ఇందులో  ఖమ్మం జిల్లాలోని ములుగుమాడు కూడా ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నక్షాలులేని 413 గ్రామాల్లో మొదటి విడత  సర్వే పనులు చేపడుతున్నామన్నారు. భూ సర్వేను విడతలవారీగా పూర్తిచేసి  భూముల మ్యాప్ తో కలిసి భూధార్  నంబర్లను అందించడంలో లైసెన్స్ సర్వేయర్లు  ఉపయోగపడతారన్నారు.   

నాంపల్లి బాధితులకు 5 చొప్పుల పరిహారం!

నాంపల్లి ఫర్నిచర్  షాప్ లో అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు పొంగులేటి సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని మంత్రి వెల్లడించారు.