అటవీ విస్తీర్ణం తగ్గుతోంది..హరితహారం మొక్కలపై గందరగోళం

అటవీ విస్తీర్ణం తగ్గుతోంది..హరితహారం మొక్కలపై గందరగోళం
  • పోడు సాగు, అక్రమంగా చెట్ల నరికివేత, స్మగ్లింగ్, వరదలే కారణం
  • సింగరేణి వల్ల మంచిర్యాలలో మాత్రమే 34.96 చ.కి.మీ. పెరిగింది
  • ఐఎస్ఎఫ్ఆర్ లో ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని అడవుల పరిస్థితి వెల్లడి

నిర్మల్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ విస్తీర్ణం తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పథకం కింద కోట్ల రూపాయలు ఖర్చు చేసి నాటిన మొక్కలపై గందరగోళం నెలకొంది. ఫలితంగా అటవీ విస్తీర్ణం పెరగాల్సింది పోయి దానికి విరుద్ధంగా తగ్గడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్(ఐఎస్ఎఫ్ఆర్) ప్రకారం.. పోడు సాగు, అక్రమంగా చెట్ల నరికివేత, స్మగ్లింగ్, వరదల కారణంగానే అడవులు అంతరించిపోతున్నాయి. ఐదారేళ్లుగా ఒక్క మంచిర్యాల జిల్లాలో మినహా  ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గిపోతున్నట్లు వెల్లడించింది.

రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ డాటాతో..

కేంద్ర అటవీ, వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో ఫీల్డ్ బేస్డ్ సర్వే ఆధారంగా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ డాటాతో అడవులపై సర్వే చేపట్టి, వాస్తవ విస్తీర్ణాన్ని నిర్ధారించారు. నిర్మల్ జిల్లాలో 45.37 చదరపు కిలోమీటర్లు, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 44.61 చదరపు కిలోమీటర్లు, ఆదిలాబాద్ జిల్లాలో 115.50 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం తగ్గిపోయిందని రిపోర్టులో పేర్కొన్నారు. 

అయితే మంచిర్యాల జిల్లాలో మాత్రం సింగరేణి సంస్థ చేపట్టిన మొక్కల పెంపకం కారణంగా 34.96 చదరపు కిలోమీటర్ల మేర అడవి పెరిగినట్లు చెప్పారు. ప్రస్తుతం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో  1,778.26, మంచిర్యాల జిల్లాలో 1,564.93, ఆదిలాబాద్ జిల్లాలో 114 5.76, నిర్మల్ జిల్లాలో 1,085.02 చదరపు కిలో మీటర్ల మేర అటవీ విస్తీర్ణం ఉన్నట్లు తెలిపారు. 

కలప కోసం యథేచ్ఛగా నరికివేత 

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అడవుల నరికివేత ఆగడం లేదు. కలప అవసరాల కోసం కొంతమంది స్మగ్లర్లు  యథేచ్ఛగా చెట్లను నరికివేస్తున్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో చెట్లను కొట్టి కలప భద్రపరిచిన ఇండ్లలో అటవీశాఖ అధికారులు  తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో స్మగ్లర్లు వారిపై తిరగబడి దాడి చేసిన విషయం తెలిసిందే. అధికారులు ప్రత్యేక నిఘా పెడుతూ స్మగ్లింగ్ ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొన్ని మారుమూల గ్రామాల్లో మాత్రం చెట్లు నరకడం కొనసాగుతోంది.  

పోడు వ్యవసాయం మరో కారణం. నిర్మల్ జిల్లాలోని కడెం, పెంబి, ఖానాపూర్, దస్తురాబాద్ అడవుల్లో సైతం కొంతకాలం క్రితం వరకు పెద్ద ఎత్తున చెట్ల నరికివేత సాగినట్లు ఫిర్యాదులున్నాయి. నిర్మల్ జిల్లాలోనూ గతంలో పలుమార్లు అటవీ శాఖ అధికారులపై స్మగ్లర్లు దాడులు చేశారు. చెట్ల నరికివేతను అరికట్టేందుకు ఇన్ ఫార్మింగ్ నెట్​వర్క్ ను ఏర్పాటు చేసుకున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదని పలువురు అంటున్నారు. పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

నాటిన మొక్కలు దాదాపు 20 కోట్లు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో  చేపట్టిన హరితహారం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదన్న విమర్శలున్నాయి. దాదాపు 20 కోట్ల మొక్కలు నాటినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ సంబంధిత లెక్కలపై అయోమయం నెలకొంది. ఇంత పెద్ద మొత్తంలో మొక్కలు నాటితే అడవుల విస్తీర్ణం గణనీయంగా పెరగాలి గానీ తగ్గిపోవడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

కొమరంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని కొన్ని మారుమూల అటవీ ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాల కారణంగానూ చెట్లు నేలకొరుగుతున్నాయన్న వాదనలున్నాయి. ముఖ్యంగా ఇక్కడి బ్లాక్ సాయిల్ వల్ల కూడా చెట్లు వరద పాలవుతున్నాయని అనేవారూ ఉన్నారు.