లక్షదీవుల అటవీ విస్తీర్ణం

లక్షదీవుల అటవీ విస్తీర్ణం

అడవులు ప్రత్యక్షంగా జాతీయోత్పత్తి, ఉపాధికి దోహదపడుతాయి. పరిశ్రమలకు, ఇంటి అవసరాలకు కలపను,  పశుసంపదకు దానాను అందిస్తాయి. పరోక్షంగా వాతావరణాన్ని సమతౌల్యంగా ఉంచడానికి దోహదపడుతాయి. వర్షపాతానికి, భూగర్భ జలాలను పెంచడానికి ఉపయోగపడుతాయి. నేల కోత, వరదల తీవ్రతను తగ్గిస్తాయి. ఇలాంటి అడవుల సమగ్ర వివరాలు పోటీ పరీక్షల్లో ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో ఇండియన్​ స్టేట్​ ఆఫ్​ ఫారెస్ట్​ రిపోర్టు – 2021 ప్రకారం దేశంలో అడవుల ప్రాముఖ్యాన్ని తెలుసుకుందాం. 

దేశ భౌగోళిక విస్తీర్ణంలో అడవులు 7.14 లక్షల చదరపు కి.మీ.లు ఉన్నాయి. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 21.71శాతం. దీనికి చెట్లతో కూడుకున్న ప్రాంతాన్నీ కలిపితే 8,09,537 చ.కి.మీ.లు. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 24.62శాతం. ఇండియన్​ స్టేట్​ ఆఫ్​ ఫారెస్ట్​ రిపోర్టు–2019తో పోలిస్తే 2021లో అడవులు 1540 చ.కి.మీ.(0.22శాతం), చెట్లు 721 చ.కి.మీ. (0.76శాతం), అడవులు, చెట్లు కలిపితే 2,261 చ.కి.మీ.(0.28శాతం) పెరిగింది. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశ అడవుల శాతం 2శాతం(10వ స్థానం). దేశ విస్తీర్ణంలో అడవుల శాతం 24శాతం. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో 20శాతం వాటాతో రష్యా అత్యధిక అడవులను కలిగి ఉంది. ఆ దేశ భౌగోళిక విస్తీర్ణంలో అడవులు శాతం 49.8శాతం. ఆ తర్వాత బ్రెజిల్​ 12శాతం వాటాను కలిగి ఉంది. కాని బ్రెజిల్​ విస్తీర్ణంలో అడవుల శాతం 59.4శాతం.  2021 అటవీ గణాంకాల్లో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అడవులు 33శాతం కంటే ఎక్కువగా ఉన్నాయి. వీటిలో 5 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 75శాతం పైన అడవులు విస్తరించాయి. దేశంలో అడవుల వ్యాప్తి ఒకే రీతిన లేదు. మధ్యప్రదేశ్, అరుణాచల్​ప్రదేవ్​ తదితర ప్రాంతాల్లో అడవులు కేంద్రీకృతమై ఉన్నాయి.  

దేశంలో చిత్తడి నేలలు గుజరాత్​ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి.  ఆ తర్వాత పశ్చిమబెంగాల్​లో ఉన్నాయి.  మాంగ్రూవ్​ అడవుల పెరుగుదల ఒడిశాలో ఎక్కువగా ఉంది. అయితే మాంగ్రూవ్​ అడవులు ఎక్కువగా పశ్చిమబెంగాల్​లో ఉన్నాయి. మొత్తం మాంగ్రూవ్​ అడవుల్లో పశ్చిమబెంగాల్​ (42.33శాతం), గుజరాత్​ (23.54శాతం), అండమాన్​ నికోబార్​ (12.34శాతం), ఏపీ (8.11శాతం)ల్లో ఉన్నాయి. పశ్చిమబెంగాల్​లో దక్షిణ 24 పరిగణాల, గుజరాత్​లో కచ్​ జిల్లాల్లో మాంగ్రూవ్​ అడవులు ఎక్కువగా ఉన్నాయి. 

జాతీయ అటవీ విధానం – 1952లో దేశ భౌగోళిక విస్తీర్ణంలో 1/3 వంతు (33శాతం లేదా 100 మిలియన్​ హెక్టార్లు) అడవులుండాలని తీర్మానించారు. కొండ ప్రాంతాల్లో 60శాతం, సమతల ప్రాంతాల్లో 20శాతం అడవులుండాలి. 1976లో సామాజిక అడవుల పెంపక కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1980లో అటవీ భూములను ఇతర ఉపయోగాలకు మళ్లించడాన్ని నిషేధించేందుకు అటవీ పరిరక్షణ చట్టం రూపొందించారు. 1985లో నిరుపయోగ భూమిని అటవీ సంపదగా మార్చేందుకు నేషనల్​ వేస్ట్​ ల్యాండ్​ డెవలప్​మెంట్​ బోర్డు ఏర్పాటు చేశారు. 1988లో నూతన అటవీ విధానంలో అడవుల అభివృద్ధి, సంరక్షణ అనే లక్ష్యాలకు ప్రాధాన్యత ఇచ్చారు.