వెపన్ లేదు.. వెహికల్ లేదు..దయనీయంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల పరిస్థితి..వాచర్లు, ట్రాకర్స్ సాయంతో డ్యూటీలు

వెపన్ లేదు.. వెహికల్ లేదు..దయనీయంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల పరిస్థితి..వాచర్లు, ట్రాకర్స్ సాయంతో డ్యూటీలు

ఆసిఫాబాద్, వెలుగు:తెల్లారితే అడవి బాట పడుతున్న అటవీ శాఖ ఉద్యోగులకు సరైన సౌలతులు ఉండట్లేదు. నిత్యం అడవిని కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, వన్యప్రాణులు, స్మగ్లర నుంచి ఆత్మ రక్షణ కోసం కనీసం ఆయుధాలు లేవు. అటవీ ప్రాంతంలో తిరిగేందుకు వాహనాలను ప్రభుత్వం అందించడం లేదని అంటున్నారు. రాత్రి వేళల్లో కలప దొంగలు, స్మగ్లర్లను ఎదుర్కొనేందుకు స్ట్రైకింగ్  ఫోర్స్, ఎనిమల్  ట్రాకర్ల సాయం తీసుకుంటున్నారు.

 కలప తరలిస్తున్న వాహనాలు సీజ్  చేసేందుకు పోలీసుల సాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక తమ బీట్​ పరిధిలో ఎవరైనా చెట్లు నరికితే, దానికి గల కారణాలు ఏమిటనే విషయాన్ని పక్కన పెట్టి రికవరీ చేయడం ఇబ్బందిగా మారుతోంది. వీటితో పాటు భూముల రీ ట్రైవ్  పెద్ద సమస్యగా మారింది.

ఏ తప్పు లేకపోయినా రికవరీ తప్పట్లే..

అడవులను కాపాడేందుకు బీట్ ఆఫీసర్లు నిత్యం అడవిలో తిరుగుతున్నా అక్కడక్కడ చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. దీనికి బీట్ ఆఫీసర్లను బాధ్యులను చేస్తున్నారు. అడవిలో నరికేసిన టేకుతో పాటు ఇతర చెట్లకు ఫైన్  పేరుతో బీట్ ఆఫీసర్ల వేతనాల నుంచి రికవరీ చేస్తున్నారు. విలువైన కలప చోరీ జరిగిన ప్రాంతంలో పని చేసిన బీట్  ఆఫీసర్లు వేతనాల్లో ఏళ్ల తరబడి రికవరీ అవుతుండడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పోడు భూముల రీ ట్రైవ్ లో నలిగిపోతున్రు..

అటవీ శాఖ ఉన్నతాధికారులు చేపడుతున్న పోడు భూముల రీ ట్రైవ్  ప్రక్రియ కింది స్థాయి ఉద్యోగులు, అధికారులకు, సిబ్బందికి ఇబ్బందికరంగా మారుతోంది. దశాబ్దాలుగా రైతులు సాగు చేస్తున్న పోడు భూములను తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో దాడులకు గురవుతున్నారు. భూములు తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో బీట్  ఆఫీసర్, సెక్షన్  ఆఫీసర్లు మాత్రమే ఫీల్డ్ లో కష్టపడాల్సి వస్తోంది. 

రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజలకు శత్రువులుగా మారుతున్నామని, వాళ్ల నుంచి వ్యతిరేకత మూటగట్టుకుంటున్నామని వాపోతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అడవులు, పోడు భూముల్లో నిద్రిస్తున్నా ఎలాంటి ఫలితం లేకుండా పోతోందని అంటున్నారు.

సిబ్బంది అంతంతే..

కలప అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అవసరమైన సిబ్బంది అందుబాటులో లేకపోవడం ప్రతికూలంగా మారుతోంది. బీట్ ఆఫీసర్ల కొరతతో సెక్షన్ ఆఫీసర్లు, డిప్యూటీ రేంజ్  ఆఫీసర్లు ఇన్ చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో 274 మంది బీట్​ ఆఫీసర్లకు గాను, ప్రస్తుతం 122 మంది పని చేస్తున్నారు.152 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో 122 మంది పని చేస్తుండగా, 40 మందికే ప్రభుత్వం 2015లో టూ వీలర్లు అందజేసింది. ఆ తరువాత నుంచి ఇప్పటి వరకు వెహికల్స్​ ఇవ్వలేదు. 

ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే..

ఆసిఫాబాద్  జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో పని చేసేందుకు బీట్  ఆఫీసర్లు వెనకడుగు వేస్తున్నారు. పోస్టింగ్  ఇచ్చిన చోట జాయిన్ అయ్యేందుకు ఇష్టపడడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో జాయిన్  అవుతున్నా, సిబ్బంది కొరత వేధిస్తోంది. బీట్​ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం.- నీరజ్ కుమార్ టిబ్రేవాల్,డీఎఫ్​వో, ఆసిఫాబాద్