వరద ముప్పు రాకుండా చూడాలి : కొండా సురేఖ

వరద ముప్పు రాకుండా చూడాలి : కొండా సురేఖ
  • నగరంలో ఎక్కడా వర్షం నీరు ఆగకుండా చూడాలి
  • ఎలక్షన్‍ కోడ్‍ వల్ల రెండు నెలలు పనులు ఆగినయ్‍
  • అభివృద్ధి పనులపై మంత్రి కొండా సురేఖ రివ్యూ

వరంగల్‍, వెలుగు: గ్రేటర్ వరంగల్ లో మునుపటిలాగా  వరద ఇబ్బందులు రావొద్దని, ఎక్కడా వర్షం నీరు ఆగొద్దని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు. రాబోయే వర్షాకాలం నేపథ్యంలో బుధవారం హనుమకొండ కుడా ఆఫీస్‍లో అధికారులతో రివ్యూ నిర్వహించారు. బల్దియా కమిషనర్‍ అశ్విని తానాజీ వాఖడే అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. 

శానిటేషన్‍, హెల్త్​, కరెంట్‍, ఇరిగేషన్‍ తదితర శాఖలవారీగా చేస్తున్న పనుల వివరాలు తెలుసుకున్నారు. ఎలక్షన్‍ కోడ్‍ వల్ల మొన్నటి వరకూ అభివృద్ధి పనులన్నీ పెండింగ్​లో పడ్డాయన్నారు. వానాకాలం మొదలవుతున్నందున వాటిని వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. పనులకు సంబంధించిన ప్రపోజల్స్​ను పంపాలని సూచించారు. 

జర్నలిస్టుల  ​ఇండ్లు పంపిణీ చేయాలని వినతి.. 

కాశీబుగ్గ/ఖిలావరంగల్​ : వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని జర్నలిస్టులకు కేటాయించిన ‘డబుల్​ ’ ఇండ్లను పంపిణీ చేయాలని బుధవారం ఖిలావరంగల్​కు వచ్చిన మంత్రి కొండా సురేఖకు జర్నలిస్టులు వినతి పత్రం ఇచ్చారు. కోడ్​ వల్ల ఇండ్ల పంపిణీ ఆగిపోయిందని మంత్రికి తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఇండ్లను పంపిణీ చేయాలని కోరారు. 

విద్యారంగ అభివృద్ధికి పెద్దపీట

రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేయనుందని మంత్రి చెప్పారు. ఖిలా వరంగల్ ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ అలుబెల్లి నర్సిరెడ్డి , కలెక్టర్ ప్రావీణ్య తో కలిసి బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సీఎం రేవంత్​ రెడ్డి ఆధ్వర్యంలో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నామని చెప్పారు. 

తాను, వరంగల్ జిల్లా కలెక్టర్ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివినట్టు మంత్రి గుర్తు చేశారు.   ఖిలా వరంగల్ లో పర్యాటకుల కోసం బ్యాటరీ వాహనాన్ని మంత్రి కొండ సురేఖ, కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. అనంతరం ఖుష్​ మహల్ నుంచి కోట వరకు వెహికల్​ను నడిపారు. ఖిలా వరంగల్ కు వచ్చే పర్యాటకుల కోసం   కాలుష్య రహిత బ్యాటరీ వాహనాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ సంధ్యారాణి, డీఈఓ వాసంతి, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. 

వరద ముప్పుపై దృష్టి సారించాలి..

 ఏటా వర్షాలతో నగరంలో కలిగే ఇబ్బందులు ఈసారి అధిగమించాలని మంత్రి కొండా సురేఖా అధికారులకు సూచించారు. సిటీలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రధానంగా నగరంలోకి రూరల్‍ ప్రాంతాల నుంచి వరదనీరు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. సిటీకి ఆ వరద ముప్పును నివారించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‍రెడ్డి, కేఆర్‍.నాగరాజు తమ నియోజకవర్గాల్లో రోడ్లు, డ్రైనేజీలు, కరెంట్‍ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో గ్రేటర్‍ మేయర్‍ గుండు సుధారాణి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్‍ తదితరులు పాల్గొన్నారు.